రాలీ (అమెరికా): అమెరికాలోని నార్త్ కరోలినా స్టేట్ యూనివర్సిటీలో గత శుక్రవారం జరిగిన కాన్వొకేషన్‌కు చీఫ్‌గెస్ట్‌గా హాజరైన భారత సంతతికి చెందిన అనిల్ కొచ్చర్ నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ వర్సిటీకి చెందిన విల్సన్ కాలేజీ ఆఫ్ టెక్స్‌టైల్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన176 మంది విద్యార్థుల చివరి ఏడాది స్టూడెంట్ లోన్స్ తానే చెల్లిస్తానని ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన తండ్రి ప్రకాశ్‌చంద్ కొచ్చర్ పంజాబ్ నుంచి రాలీకి వచ్చి ఇదే యూనివర్సిటీలో చదువుకున్నారని గుర్తు చేసుకున్నారు. ఆయన జ్ఞాపకార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
డిగ్రీతోపాటు ఎటువంటి ఆర్థిక భారం లేకుండా మీ లక్ష్యాలను చేరుకోవడానికి, రిస్క్ తీసుకోవడానికి కావాల్సిన స్వేచ్ఛతో ఇక్కడి నుంచి వెళ్లాలని తాను, తన భార్య మార్లిన్ కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ ప్రకటన వినగానే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆనందంతో లేచి నిలబడి చప్పట్లతో కృతజ్ఞతలు తెలిపారు.
