బ్రేక్ ఫాస్ట్ లో సూపర్ ఫుడ్స్.. ఉదయాన్నే తింటే రోజంతా ఎనర్జీ!

బ్రేక్ ఫాస్ట్ లో సూపర్ ఫుడ్స్.. ఉదయాన్నే తింటే రోజంతా ఎనర్జీ!

చాలామంది పని తొందరలో  బ్రేక్ ఫాస్ట్ మానేస్తారు లేదా ఏదో ఒకటి తిని కానిచ్చేస్తారు. కానీ, రోజంతా ఉత్సాహంగా ఉండాలన్నా, మీ జీర్ణక్రియ బాగుండాలన్నా సరైన టిఫిన్ చేయడం చాలా ముఖ్యం. ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్  ప్రకారం.. మీ టిఫిన్ లో ఈ మూడు పదార్థాలు ఉంటే మీరు మరింత ఆరోగ్యంగా ఉంటారు......

1. ఉడికించిన గుడ్లు
గుడ్లను ప్రకృతి ప్రసాదించిన 'మల్టీవిటమిన్' అని పిలుస్తారు. ఉదయాన్నే ఉడికించిన గుడ్డు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు చూస్తే... ఇందులో ఉండే అధిక ప్రోటీన్ కండరాల బలం పెరుగుదలకు, అవి దెబ్బతినకుండా ఉండటానికి తోడ్పడుతుంది. గుడ్లలో ఉండే అమినో యాసిడ్స్ మీ పేగులను ఆరోగ్యంగా ఉంచుతాయి. గుడ్డు తింటే కడుపు నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది. దీనివల్ల మధ్యాహ్నం వరకు అనవసరమైన జంక్ ఫుడ్ తినాలనే కోరిక కలగదు.

2. చియా గింజలు 
చిన్నగా ఉండే ఈ గింజలు పోషకాల గనులు. వీటిని రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయాన్నే తీసుకోవడం మంచి  పద్ధతి. నానబెట్టిన చియా గింజలు జెల్ లాగా మారుతాయి. ఇందులో ఉండే పీచు పదార్థం మలబద్ధకం సమస్యను వదిలించి, జీర్ణక్రియను సాఫీగా ఉంచుతుంది. ఇంకా పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా పెరగడానికి ఈ గింజలు సహాయపడతాయి. తిన్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఇవి అడ్డుకుంటాయి. షుగర్ వ్యాధి ఉన్నవారికి ఇది చాలా మేలు చేస్తుంది.

3. గ్రీక్ యోగర్ట్ 
సాధారణ పెరుగు కంటే గ్రీక్ యోగర్ట్ చిక్కగా ఉండటమే కాకుండా, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. అయితే దీనిని కొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తియ్యగా లేని ప్లెయిన్ గ్రీక్ యోగర్ట్‌నే తీసుకోండి. ఫ్లేవర్డ్ పెరుగుల్లో చక్కెర ఎక్కువగా ఉంటుంది, అది ఆరోగ్యానికి మంచిది కాదు. ఇందులో ఉండే ప్రోబయోటిక్స్ (మంచి బ్యాక్టీరియా) మీ రోగనిరోధక శక్తిని పెంచి, ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తాయి.

ఇందులో కాల్షియం, విటమిన్ B12 పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ ఎముకలను గట్టిపరచడంతో పాటు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. ఆరోగ్యకరమైన అల్పాహారం అంటే కేవలం కడుపు నింపుకోవడం కాదు.. అది మీ శరీరానికి కావాల్సిన సరైనవి  అందించడం.