ఆగస్టు 17వ తేదీన నాగపంచమి. నాగపంచమి ప్రాశస్త్యం గురించి స్వయంగా ఆ పరమశివుడే పార్వతీదేవికి చెప్పినట్లు పురాణాలు వివరించాయి. శ్రావణ మాస శుక్ల పంచమి నాడు నాగారాధన చేయడం అత్యంత శ్రేష్టమైంది. ఆరోజు(ఆగస్టు 17) ద్వారానికి ఇరువైపులా నాగదేవత చిత్రాలను గోమయంతో రాసి పూజ చేయడం ఎంతో శుభప్రదం. ఈ పండగ విశిష్టత ఏమిటి? దీనిని ఎలా జరుపుకోవాలి? వంటి విషయాలను తెలుసుకుందాం.
శివుని మెడలోని ఆభరణం నాగుపాము. శ్రావణ మాసంలోని నాగ పంచమి రోజున నాగ దేవతని పూజిస్తే జీవితం సంతోషంగా ఉంటుందని విశ్వాసం. శ్రావణ శుద్ధ పంచమిని నాగ పంచమిగా వ్రత గ్రంథాలు పేర్కొంటున్నాయి. నాగపంచమి రోజున (ఆగస్టు 17న) ఉడకబెట్టిన ఆహారం మాత్రమే భుజించాలని హేమ పురాణంలో చెప్పినట్లు పండితులు చెబుతున్నారు.
నాగపంచమి విశిష్టత గురించి శివుడు పార్వతికి చెప్పినట్టు హేమాద్రి ప్రభాస ఖండంలో ఉంది. నాగపంచమి రోజు భూమి దున్నకూడదని అంటారు. అయితే నాగపంచమిని జరుపుకునే విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలదీ చెరో దారి. తెలంగాణలో శ్రావణ మాసంలో నాగపంచమిగా జరుపుకుంటే, ఏపీలో మాత్రం కార్తీక మాసంలో నాగులను పూజిస్తారు.
నాగ పంచమి రోజున పాములను హాని చేయకూడదు. కొంతమంది పాములను ఆడిస్తూ సొమ్ము చేసుకుంటుంటారు. సాక్షాత్తూ సుబ్రహ్మణ్య స్వామిగా ఆరాధించే పాములను ఆడించడం మంచిది కాదని పండితులు సూచిస్తున్నారు. పాము కనిపిస్తే దూరం పాటించి దణ్ణం పెట్టుకోవాలని చెబుతున్నారు. అంతేకాని వాటిని రెచ్చగొట్టడం లాంటి పనులను చేయకూడదని చెబుతున్నారు. ఒక వేళ పాములు జనావాసాల్లో కనిపిస్తే స్నేక్ రెస్క్యూ టీంకు సమాచారం ఇచ్చి వాటిని సురక్షిత ప్రాంతాలకు చేర్చేలా ప్రయత్నించాలని.. పొరపాటున కూడా కొట్టి చంపవద్దని పండితులు సూచించారు.
