కురుక్షేత్రంలో తన వాళ్లను చూసిన తర్వాత అర్జునుడికి యుద్ధంపై నిరాశ, నిరుత్సాహం కలుగుతాయి. ఆ దుఃఖం నుంచి బయటపడేయడానికి, సందేహాలను తొలగించి అర్జునిడిని సమరానికి సిద్ధం చేయడానికి నందనుడు భగవద్గీత చెప్తాడు. జీవన సమరంలో కింద మీద పడుతున్న మనమంతా... కురుక్షేత్రంలో శ్రీ కృష్ణుడి ముందు చతికిల పడ్డ అర్జునుడి లాంటి వాళ్లమే! అంత పెద్ద గీతలో సారమేంటో తెలుసుకుంటే చాలు.. మన గీత మారుతుంది! గీతలో ఉన్న పద్దెనిమిది అధ్యాయాల సారం కృష్ణుడి మాటల్లో..
ఏం జరిగిందో, అది బాగా జరిగింది. ఏం జరుగుతుందో అది బాగా జరుగుతుంది. ఏం జరగబోతుందో అది కూడా బాగానే జరగబోతోంది. నీదేం పోయింది? ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? నువ్వేం తెచ్చావని? నువ్వు ఏది పోయిందని బాధపడుతున్నావో, అది ఇక్కడి నుంచే తీసుకున్నావు. నువ్వు ఏం ఇచ్చావో అది ఇక్కడి నుంచే ఇచ్చావు. ఈ రోజు ఏది నీదో, అది నిన్న ఎవరిదో? ఎల్లుండి ఇంకెవరిదో.. మరెవరిదో అయిపోతుంది. పరివర్తన సంసార నియమం! అనవసరంగా ఎందుకు విచారిస్తున్నావు? అనవసరంగా దేనికి భయపడుతున్నావు? ఎవరు నిన్ను చంపగలరు? ఎందుకంటే ఆత్మ పుట్టదూ.. చావదూ. దానికి చావు. పుట్టుకలు లేవు.
మార్పు సృష్టి నియమం
మార్పు సృష్టి నియమం. దేనినైతే నువ్వు మృత్యువు అనుకుంటున్నావో దాని వెంటనే పుట్టుక ఉంటుంది. ఒక క్షణంలో నువ్వు కోట్లకు అధికారివి అవుతావు. మరొక క్షణంలో నువ్వు దరిద్రుడివి కావచ్చు. నాది- నీది, చిన్నా-పెద్దా, నావాళ్లు-పరాయివాళ్లు అనేది నీ మనసు నుంచి తీసేయ్. సంకల్పం నుంచి తీసేయ్. అప్పుడు అందరూ నీవాళ్లవుతారు. నువ్వూ అందిరివాడివి అవుతావు.
ఈ శరీరం నీది కాదు.
ఈ శరీరం నీదికాదు. నువ్వూ, శరీరం ఒకటి కాదు. ఈ శరీరం.. భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశాలతో తయారైంది. తిరిగి మళ్లీ వాటిలోనే అది కలిసిపోతుంది. కానీ, ఆత్మ మాత్రమే శాశ్వతమైనది. నువ్వు ఎవరు? నిన్ను నువ్వు భగవంతునికి సమర్పించుకో.
ఇదే అన్నింటికంటే ఉత్తమ మార్గం. ఎవరైతే ఈ మార్గాన్ని తెలుసుకుంటారో వాళ్లు భయం, చింత, దుఃఖాల నుంచి శాశ్వతంగా విముక్తి పొందుతారు. ఏదైతే నువ్వు చేస్తున్నావో.. దాన్ని భగవంతునికి సమర్పిస్తూ వెళ్లు. దాంతో నువ్వు జీవన్ముక్తి, అనంతమైన సంతోషాన్ని పొందుతావు.
