దేశంలోని టాప్ వ్యాపార సంస్థల్లో ఒకటైన టాటా గ్రూప్‌లో కీలక లీడర్‌షిప్ మార్పునకు రంగం సిద్ధమైంది. టాటా సన్స్ ఛైర్మన్‌గా మరోసారి కొనసాగేందుకు బోర్డులో నోయల్ టాటా ససేమిరా అనడంతో ఎన్. చంద్రశేఖరన్ తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఆగస్టు 12న పదవీకాలం ముగియకుండానే తన రాజీనామాను సమర్పించారు. ఈ పరిణామాన్ని టాటా ట్రస్ట్స్ గురువారం అధికారికంగా ధృవీకరించింది. చంద్రశేఖరన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ట్రస్ట్ పేర్కొంది.
ఫిబ్రవరి 20, 2027తో ముగియనున్న తన ప్రస్తుత పదవీకాలం తర్వాత తిరిగి ఛైర్మన్ స్థానాన్ని ఆశించట్లేదని చంద్రశేఖరన్ తెలిపారు. ఈ మేరకు ఆగస్టు 12న సర్ దోరాబ్జీ టాటా ట్రస్ట్ నామినీ డైరెక్టర్లకు ఆయన ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందించారు. గత దశాబ్ద కాలంగా టాటా గ్రూప్‌కు అందించిన విశేష సేవలను ట్రస్ట్ కొనియాడుతూ.. చంద్రశేఖరన్ తీసుకున్న రాజీనామా నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే ఆయన స్థానంలో కొత్త వ్యక్తి నియామకానికి ప్రక్రియను స్టార్ట్ చేస్తున్నట్లు చెప్పింది ట్రస్ట్.
6 నెలల ప్రతిష్టంభనకు తెర..
చంద్రశేఖరన్ 3వ సారి 5 ఏళ్ల పాటు ఛైర్మన్ పదవి కోరుకోవడంతో గత 6 నెలలుగా బోర్డులో ప్రతిష్టంభన నెలకొంది. టాటా ట్రస్ట్స్, నామినేషన్ కమిటీ ఆయనకు మద్దతు తెలిపినప్పటికీ.. బోర్డులోని నోయల్ టాటా వ్యతిరేకించడం వల్ల ఏకగ్రీత సాధ్యపడలేదు. దీంతో విసుగు చెందిన ఆయన స్వయంగా తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. టాటా గ్రూప్‌లో 40 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రశేఖరన్.. 2017 నుంచి ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. టాటాల ఫ్యామిలీకి చెందని తొలి ఛైర్మన్ గా రతన్ టాటా సన్నిహితుడిగా చంద్రశేఖరన్ అత్యున్నత పదవిలో ఇన్నాళ్లు బాధ్యతలు చేపట్టారు.
నిపుణుల కమిటీ ఏర్పాటు
కొత్త ఛైర్మన్ ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయడానికి సర్ దోరాబ్జీ టాటా ట్రస్ట్ ట్రస్టీలు త్వరలోనే ఒక సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. కంపెనీ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్‌కు అనుగుణంగా తగిన అభ్యర్థిని ఈ కమిటీ సిఫారసు చేస్తుంది. ఈ నాయకత్వ మార్పు సజావుగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగేందుకు టాటా సాన్స్‌కు పూర్తి సపోర్ట్ ఇస్తామని ట్రస్ట్ స్పష్టం చేసింది. ప్రస్తుతం కొత్త ఛైర్మన్ పదవి రేసులో టాటా స్టీల్ సీఈఓ టీవీ నరేంద్రన్ పేరు వినిపిస్తోంది. చూడాలి టాటా సన్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో మరి.
ALSO READ : దేశంలో అవసరానికి మించి ఇథనాల్ ఉత్పత్తి..
దివంగత రతన్ టాటా మరణం తరువాత 2024లో టాటా ట్రస్ట్స్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన నోయెల్ టాటా, కొత్త పదవీకాలం విషయంలో కొన్ని స్పష్టతలను కోరినట్లు సమాచారం. కొత్త వ్యాపారాల్లో నష్టాల నివారణ, ఐదేళ్ల వ్యూహాత్మక రోడ్‌మ్యాప్ వంటి అంశాలపై చర్చలు జరిగాయి. ఏదేమైనా.. టాటా గ్రూప్‌ను దశాబ్ద కాలం పాటు విజయవంతంగా నడిపించిన చంద్రశేఖరన్ తప్పుకోవాల్సిన పరిస్థితి రావటంతో టాటా సన్స్‌లో కొత్త శకం ప్రారంభం కానుంది.
