వరంగల్ మడికొండ డంప్ యార్డులో చెత్త నుంచి గ్యాస్.. సక్సెస్ అయితే ఆ గ్రామాల కష్టాలు తీరినట్లే..

వరంగల్ మడికొండ డంప్ యార్డులో చెత్త నుంచి గ్యాస్.. సక్సెస్ అయితే ఆ గ్రామాల కష్టాలు తీరినట్లే..
  • మడికొండ డంప్ యార్డులో కంప్రెస్డ్ బయో గ్యాస్ తయారు చేసేందుకు జీడబ్ల్యూఎంసీ అడుగులు
  •     రూ.97.47 కోట్లతో సీబీజీ ప్లాంట్ ఏర్పాటుకు కసరత్తు
  •     ప్రతిరోజు 100 టన్నుల వరకు ప్రాసెస్ చేసేలా ప్లాన్
  •     సక్సెస్ అయితే తీరనున్న డంప్ యార్డు బాధిత గ్రామాల కష్టాలు

హనుమకొండ, వెలుగు: వరంగల్ నగరానికి మడికొండ డంపింగ్ యార్డులోని చెత్త నుంచి బయో గ్యాస్ ఉత్పత్తి కానుంది. దాదాపు ఏడెనిమిది లక్షల టన్నుల మేర వ్యర్థాలు పోగైన ఈ డంపింగ్ యార్డులో బయో మైనింగ్ చేపట్టినా కొత్తగా వస్తున్న చెత్తకు పరిష్కారం దొరకని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే గ్రేటర్ లో ఉత్పత్తి అవుతున్న చెత్త నుంచి కంప్రెస్డ్ బయో గ్యాస్ (సీబీజీ) ఉత్పత్తి చేసేందుకు జీడబ్ల్యూఎంసీ అడుగులు వేస్తోంది. 

స్వచ్ఛ భారత్ మిషన్, గోబర్ ధన్ స్కీం కింద డంప్ యార్డులో 100 టన్స్ పర్ డే (టీపీడీ) కెపాసిటీతో సీబీజీ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇటీవల నిర్వహించిన జీడబ్ల్యూఎంసీ పాలకవర్గ చివరి మీటింగ్ లో ఆమోదం లభించడంతో ఇంజినీరింగ్ అధికారులు టెండర్ ప్రక్రియ స్టార్ట్ చేశారు. ఈ ప్రక్రియ సక్సెస్ అయితే నగరంలో చెత్త సమస్యకు పరిష్కారం దొరకడంతో పాటు మడికొండ డంప్ యార్డు బాధిత గ్రామాలు కూడా ఊపిరి పీల్చుకోనున్నాయి.

తడి చెత్తతో సమస్య.. 

గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ లోని 66 డివిజన్లలో 2.5 లక్షల ఇండ్లు ఉండగా, 11 లక్షలకుపైగా జనాభా ఉంది. ప్రతిరోజూ 350 టన్నులకుపైగా చెత్త వెలువడుతోంది. కాగా, ఈ చెత్తనంతా ప్రాసెస్ చేసేందుకు వరంగల్ శివారులోని మడికొండ, రాంపూర్ గ్రామాల సమీపంలో దాదాపు 32 ఎకరాల్లో డంపింగ్ యార్డు ఏర్పాటు చేశారు. కానీ చెత్తను ప్రాసెస్ చేసేందుకు సరైన ఏర్పాట్లు లేకపోవడంతో అందులో ఏడెనిమిది లక్షల టన్నుల వ్యర్థాలు పేరుకుపోయాయి. 

ఈ నేపథ్యంలో చెత్త సమస్యకు పరిష్కారం చూపేందుకు 2021లో స్మార్ట్ సిటీ నిధులు రూ.37 కోట్లతో ఘన వ్యర్థాలను ప్రాసెస్ చేసి ఎరువుగా మార్చేందుకు బయో మైనింగ్ పనులు చేపట్టారు. దాదాపు మూడేండ్ల పాటు ఆ పనులు కొనసాగగా, మొదటి విడత 3.75 లక్షల టన్నులు, రెండో విడత 42 వేల టన్నుల బయో మైనింగ్ ద్వారా ప్రాసెస్ చేశారు. కానీ రోజురోజుకూ వెలువడుతున్న చెత్తకు పరిష్కారం లేకపోవడంతో మడికొండ డంపింగ్ యార్డులో దాదాపు 4 లక్షల టన్నుల మేర వ్యర్థాలు పోగయ్యాయి. అందులో ఎక్కువ శాతం తడి చెత్తే ఉండటం సమస్యగా మారింది.

రూ.97.47 కోట్లతో సీబీజీ ప్లాంట్..

వరంగల్ నగరంలో వెలువడుతున్న తడి చెత్తతో సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతోనే వెజ్ టేబుల్, ఫ్రూట్ మార్కెట్ల నుంచి వచ్చే ఫ్రెష్ వేస్టేజీతో పాటు ఇండ్ల నుంచి వెలువడే తడి చెత్తను ప్రాసెస్ చేసి కంప్రెస్డ్ బయో గ్యాస్ ను ఉత్పత్తి చేసేలా జీడబ్ల్యూఎంసీ అధికారులు ప్లాన్ చేశారు. ఈ మేరకు స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 కింద గాల్వనైజింగ్ ఆర్గానిక్ బయో- అగ్రో రిసోర్సెస్-ధన్ (గోబర్-ధన్) స్కీమ్ లో భాగంగా మడికొండ డంప్ యార్డులో సీబీజీ ప్లాంట్ ఏర్పాటుకు కసరత్తు చేశారు. ఇప్పటికే మధ్యప్రదేశ్, ఛత్తీస్ గడ్, ఉత్తర్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో ఈ ప్లాంట్లు ఉండగా, వరంగల్ లోనూ నెలకొల్పేందుకు ప్రణాళిక రూపొందించారు. బయో మైనింగ్ చేపట్టడం ద్వారా డంపింగ్ యార్డులో 17 ఎకరాల మేర ఖాళీ అవగా, అందులోని 10 ఎకరాల్లో 100 టీపీడీ కెపాసిటీతో సీబీజీ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేశారు. 

ఈ మేరకు నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ కు చెందిన క్లైమేట్ ప్రాజెక్ట్స్ ప్రిపరేషన్ ఫెసిలిటీ టీమ్ ఇక్కడి పరిస్థితులపై స్టడీ చేసింది. వ్యర్థాల నుంచి గ్యాస్ తయారీ సాధ్యాసాధ్యాలపై సమగ్ర నివేదిక తయారు చేసి, రూ.97.47 కోట్లతో సీబీజీ ప్లాంట్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో పీపీపీ ప్రాతిపదికన సీబీజీ ప్లాంట్ నెలకొల్పనుండగా, సంబంధిత ఏజెన్సీకి రూ.32 కోట్లు వీజీఎఫ్ కింద ఇచ్చేందుకు నిర్ణయించారు. ఈ మేరకు జీడబ్ల్యూఎంసీ ఇంజినీరింగ్ అధికారులు టెండర్ ప్రక్రియను ప్రారంభించారు.

ఎంఆర్ఎఫ్ తో పొడి చెత్త ప్రాసెస్..

ఓ వైపు తడి చెత్తను ప్రాసెస్ చేసేందుకు సీబీజీ ప్లాంట్ ఏర్పాటు చేస్తుండగా, పొడి చెత్తను కూడా క్లీన్ చేసేందుకు మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ (ఎంఆర్ఎఫ్) ప్రక్రియ చేపడుతున్నారు. దీని ద్వారా తడి, పొడి చెత్తను వేరు చేయడంతోపాటు అవకాశం ఉన్న పదార్థాలను రీసైక్లింగ్ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఎంఆర్ఎఫ్ ప్రక్రియకు టెండర్లు కూడా పిలిచారు. సీబీజీ ప్లాంట్ తో పాటు ఎంఆర్ఎఫ్ ఏర్పాటు పనులు టెండర్ దశలో ఉండగా, ఈ రెండు సక్సెస్ అయితే మడికొండతో పాటు రాంపూర్, ఎలుకుర్తి, అయోధ్యపురం తదితర చుట్టుపక్కల గ్రామాలకు డంపింగ్ యార్డు బాధలు తీరిపోనున్నాయి.

మూడు నెలల్లో పనులు స్టార్ట్..

మడికొండ డంపింగ్ యార్డులో తడిచెత్త నుంచి గ్యాస్ ఉత్పత్తి చేయాలనే ఉద్దేశంతో  సీబీజీ ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నాం. పీపీపీ పద్ధతిలో సీబీజీ ప్లాంట్ నెలకొల్పేందుకు టెండర్లు పిలుస్తున్నాం. ఈ ప్రక్రియ పూర్తయితే మూడు నెలల్లోనే సీబీజీ ప్లాంట్ వర్క్స్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఎంఆర్ఎఫ్ తో పొడి చెత్త కూడా ప్రాసెస్ అవుతుంది, తొందర్లోనే మడికొండ డంపింగ్ యార్డు సమస్య పరిష్కారం కానుంది.
- మహేందర్, ఈఈ, జీడబ్ల్యూఎంసీ