Women Cricketers Safety: సోషల్ మీడియాలో సెలబ్రిటీలపై, ముఖ్యంగా మహిళా అథ్లెట్లపై వచ్చే అసభ్యకర, వేధింపుల కామెంట్ల (Online Abuse) కు చెక్ పెట్టేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ఒక సూపర్ ప్రోగ్రామ్‌ను తీసుకొచ్చింది. ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 నేపథ్యంలో ఐసీసీ ప్రవేశ పెట్టిన ప్లేయర్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ (ICC Player Protection Programme) కు మహిళా క్రికెటర్ల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది.
60 వేల కామెంట్లు.. 370 మంది యూజర్లు బ్లాక్:
ఐసీసీ ఈ రక్షణ కవచం కోసం 'Freedom2hear' అనే ఏఐ- పవర్డ్ మోడరేటర్ సంస్థతో చేతులు కలిపింది. వరల్డ్ కప్ టోర్నీ స్టార్ట్ అయిన మొదటి వారంలోనే ఈ టూల్ చూపించిన విశ్వరూపం చూపించింది. సోషల్ మీడియాలో దాదాపు 2,50,000 కామెంట్లను ఈ టూల్ రివ్యూ చేసింది. అందులో ఆటగాళ్లను వేధిస్తూ, మానసికంగా కుంగదీసేలా ఉన్న దాదాపు 60,000 చెత్త కామెంట్లను (Harmful Content) గుర్తించి వెంటనే డిలీట్ చేసింది.
2 వేల అకౌంట్లు బ్లాక్:
పదే పదే ఇలాంటి పనులు చేస్తున్న 2,000 మందికి పైగా నెటిజన్లపై తాత్కాలిక ఆంక్షలు విధించడమే కాకుండా, ఏకంగా 370 మంది యూజర్లను పూర్తిగా బ్లాక్ చేసింది. ప్రస్తుతం వరల్డ్ కప్‌లో ఆడుతున్న 12 జట్లలో 7 టీమ్స్ ఈ ప్రొటెక్షన్‌ను వాడుకుంటున్నాయి. కేవలం ప్లేయర్లే కాకుండా అంపైర్లు, బ్రాడ్‌కాస్టర్లు కూడా ఇందులో రిజిస్టర్ అయ్యారు. టోర్నీ మొదట్లోనే 50కి పైగా కొత్త సైన్-అప్‌లు నమోదయ్యాయంటే దీని అవసరం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.
సోషల్ మీడియా ఒక విషపూరితమైనది:
భారత స్టార్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ రాధా యాదవ్ కూడా ఈ ప్రోగ్రామ్‌లో జాయిన్ అయింది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పెరుగుతున్న నెగిటివిటీపై ఆమె మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్రెండ్స్, ఫ్యాన్స్‌తో మాట్లాడటానికి సోషల్ మీడియా ఒక మంచి ప్లాట్‌ఫామ్ అయినప్పటికీ, ఈ మధ్య కాలంలో ఇది ఒక విషపూరితమైన (Toxic) స్థలంగా మారిపోయింది. ముఖ్యంగా మహిళా అథ్లెట్లకు ఇది నరకంగా మారింది. అందుకే దీనికి పరిష్కారం కోసం నేను ఈ ఐసీసీ ప్రోగ్రామ్‌లో సైన్ అప్ చేశాను అని ఓపెన్‌గా చెప్పింది.
* ఇదే ముచ్చటపై ఇంగ్లాండ్ వికెట్ కీపర్ బ్యాటర్ అమీ జోన్స్ కూడా మాట్లాడుతూ.. మనం స్టేడియంలో 100 శాతం ఎఫర్ట్ పెట్టి ఆడుతున్నప్పుడు ఇట్లాంటి అబ్యూసివ్ కామెంట్లు మానసికంగా నెగిటివ్ ఎఫెక్ట్ చూపిస్తాయి. ఫ్యాన్స్‌తో మంచి రిలేషన్ ఉన్నా, కొంతమంది మాత్రం ఇష్టమొచ్చినట్టు వాగుతారు.. ప్లేయర్ల మానసిక ఆరోగ్యం కోసం ఐసీసీ ఇలాంటి సర్వీస్ ఇవ్వడం గ్రేట్ అని కొనియాడింది.
2024లోనే పునాది.. యంగ్ ప్లేయర్లకు బిగ్ రిలీఫ్:
నిజానికి ఈ ప్లేయర్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్‌ను ఐసీసీ 2024 ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ ముందరే పైలట్ ప్రాజెక్ట్‌గా స్టార్ట్ చేసింది. అప్పటి నుంచి అన్ని ఐసీసీ ఈవెంట్లలో దీనిని వాడుతున్నారు. కాగా 2024 లోనే ఇందులో చేరిన స్కాట్లాండ్ ప్లేయర్ సారా బ్రైస్ మాట్లాడుతూ.. ఈ టూల్ వల్ల ప్లేయర్లకు మైండ్ పీస్ దొరుకుతుంది.. ముఖ్యంగా సోషల్ మీడియాను ఎక్కువగా వాడే యంగ్ ప్లేయర్లకు ఇదొక పెద్ద రక్షణ కవచం అని వెల్లడించింది.
