Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరపున పరుగుల సునామీ సృష్టించి, ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్న భారత సరికొత్త బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేయడానికి (International Debut) రెడీ అయిపోయాడు. ఇయ్యాల్టి నుంచి (జూన్ 26) బెల్‌ఫాస్ట్‌లో ఐర్లాండ్‌తో ప్రారంభం కానున్న టీ20 సిరీస్ ద్వారా ఈ 15 ఏళ్ల వండర్ కిడ్ టీమిండియా క్యాప్ అందుకోబోతున్నాడు. ఈ క్రేజీ అరంగేట్రంలో వైభవ్ బద్దలు కొట్టడానికి సిద్ధంగా ఉన్న 5 భారీ రికార్డుల గురించి ఇప్పుడు V6 వెలుగు స్పోర్ట్స్ లో చూద్దాం..
ఐర్లాండ్‌లో వైభవ్ క్రేజ్.. ప్రత్యేకంగా స్టాండ్‌లు:
కేవలం 15 ఏళ్ల వయస్సే అయినా, దేశవాళీ క్రికెట్ నుంచి మొన్నటి ఐపీఎల్ వరకు వైభవ్ సూర్యవంశీ సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ఐపీఎల్‌లో ఏకంగా 776 రన్స్ కొట్టి యావత్ క్రికెట్ ప్రపంచాన్ని తనవైపుకు తిప్పుకున్నాడు. ఈరోజు (జూన్ 26) భారత్ వర్సెస్ ఐర్లాండ్ జట్ల మధ్య జరగబోయే పోరు కోసం ఇరు దేశాల అభిమానులు ఎంతగానో వేచి చూస్తున్నారు. ముఖ్యంగా వైభవ్ ఆటను ప్రత్యక్షంగా చూడటం కోసం ఐర్లాండ్ క్రికెట్ బోర్డు ఏకంగా మైదానంలో తాత్కాలిక స్టాండ్‌లను నిర్మిస్తోంది.
సచిన్ రికార్డు ఖేల్ ఖతం:
భారత క్రికెట్ చరిత్రలో అత్యంత పిన్న వయసులో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టిన రికార్డు ఇప్పటి వరకు క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ తన 16 ఏళ్ల 205 రోజుల వయసులో భారత్ తరఫున తొలి మ్యాచ్ ఆడాడు. కానీ, ఇటీవల ఐపీఎల్ సమయంలోనే తన 15వ పుట్టినరోజు జరుపుకున్న వైభవ్, ఐర్లాండ్ సిరీస్‌లో బరిలోకి దిగితే సచిన్ పేరిట ఉన్న మూడు దశాబ్దాల నాటి రికార్డు బ్రేక్ కానుంది. ఇండియా తరఫున అత్యంత పిన్న వయసులో అరంగేట్రం చేసిన ప్లేయర్ గా వైభవ్ సరికొత్త చరిత్ర సృష్టిస్తాడు.
అరంగేట్రంలోనే సిక్సర్ల సునామీ:
టీ20 అరంగేట్ర మ్యాచ్‌లోనే అత్యధిక సిక్సర్లు బాదిన భారత ఆటగాడిగా ఇషాన్ కిషన్ (4 సిక్సర్లు) రికార్డు సృష్టించాడు. క్లీన్ హిట్టింగ్‌కు మారుపేరైన వైభవ్ సూర్యవంశీ, తన తొలి మ్యాచ్‌లోనే క్రీజులో సెట్ అయి ఐదు సిక్సర్లు కొడితే, ఇషాన్ పేరుపై ఉన్న హిస్టరీని అధిగమించే అవకాశం కనిపిస్తుంది.
రహానే రన్స్ రికార్డుపై గురి:
2011లో ఇంగ్లాండ్‌పై టీ20 అరంగేట్రం చేసిన అజింక్య రహానే 39 బంతుల్లో 61 రన్స్ చేయగా, ఇప్పటికీ భారత్ తరఫున అరంగేట్రంలోనే అత్యధిక పరుగులు చేసిన రికార్డును తన పేరుపైనే ఉంచుకున్నాడు. ఒకవేళ ఐర్లాండ్‌తో జరిగే మ్యాచ్‌లో వైభవ్ 62 రన్స్ చేస్తే, 15 ఏళ్ల వయసులోనే రహానే రికార్డును కూడా తుడిచేస్తాడు.
ఐర్లాండ్ గడ్డపై సరికొత్త హస్టరీ:
ఇండియన్ క్రికెట్ చరిత్రలో ఐర్లాండ్ గడ్డపై టీ20 అరంగేట్రం చేసిన సిద్ధార్థ్ కౌల్, ఉమ్రాన్ మాలిక్, ప్రసిద్ధ్ కృష్ణ, రింకూ సింగ్ లాంటి ఆటగాళ్లెవరూ తమ తొలి మ్యాచ్‌లో కనీసం ఒక్క రన్ కూడా చేయలేకపోయారు. కాబట్టి, ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ కేవలం ఒక పరుగు చేసినా, ఐర్లాండ్ గడ్డపై డెబ్యూ చేసి పరుగుల ఖాతా తెరిచిన తొలి భారతీయ బ్యాటర్‌గా రికార్డు క్రియేట్ చేస్తాడు.
రోహిత్ శర్మ రికార్డుకే ఎసరు:
ప్రస్తుతం ఐర్లాండ్ గడ్డపై టీ20ల్లో అత్యధిక రన్స్ చేసిన భారత ఓపెనర్‌గా రోహిత్ శర్మ (97 పరుగులు) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. వైభవ్ సూర్యవంశీ కనుక ఓపెనర్‌గా బరిలోకి దిగి 98 పరుగులు కొడితే, ఏకంగా హిట్ మ్యాన్ రికార్డును బద్దలు కొట్టి ఐర్లాండ్‌లో అత్యంత విజయవంతమైన ఇండియన్ ఓపెనర్‌గా నిలవనున్నాడు.
