ప్రపంచ ప్రఖ్యాత ఆటోమొబైల్ దిగ్గజం.. పోర్షే, ఆడి కార్ల మాతృసంస్థ 'వోక్స్‌వ్యాగన్' తన చరిత్రలోనే అత్యంత భారీ లేఆఫ్స్‌కు తెరలేపనుంది. కంపెనీని మరింత పోటీతత్వంతో మార్చేందుకు సీఈఓ ఆలివర్ బ్లూమ్ ఏకంగా లక్ష మంది ఉద్యోగులను తొలగించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా రిపోర్ట్స్ చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ జర్మన్ ఆటో దిగ్గజం ప్రపంచవ్యాప్తంగా సుమారు 6లక్షల 57వేల మంది సిబ్బందిని కలిగి ఉంది. అంటే దాదాపు 15 శాతానికి పైగా ఉద్యోగులపై ఈ లేఆఫ్స్ ప్రభావం పడనుందట.
ఈ భారీ ఉద్యోగాల కోతతో పాటు కంపెనీ వ్యయాలను తగ్గించుకోవడానికి జర్మనీలోని నాలుగు ప్రధాన ఫ్యాక్టరీలను కూడా మూసివేయాలని సీఈఓ భావిస్తున్నారు. ఇందులో ప్రసిద్ధ ఆడి ప్లాంట్ నెకర్సల్మ్‌తో పాటు హనోవర్, జ్విక్కావ్, ఎమ్డెన్‌లలోని వోక్స్‌వ్యాగన్ ప్లాంట్లు ఉన్నాయి. ఈ దశాబ్దం చివరి నాటికి జనరల్ ఓవర్‌హెడ్ ఖర్చులను12.5 బిలియన్ డాలర్ల మేర తగ్గించడమే లక్ష్యంగా ఈ క్రేజీ అండ్ అగ్రెసివ్ రీస్ట్రక్చరింగ్ ప్లాన్‌ను సిద్ధం చేశారట.
అమెరికా విధిస్తున్న టారిఫ్‌లు, చైనా మార్కెట్‌లో తీవ్ర మందగమనం, ఈవీ రంగంలో బీవైడీ, స్టెల్లాంటిస్ వంటి గ్లోబల్ రైవల్స్ నుండి వస్తున్న గట్టి పోటీని తట్టుకోవడానికే వోక్స్‌వ్యాగన్ ఈ కఠిన నిర్ణయాల వైపు అడుగులు వేస్తోంది. ఇప్పటికే కంపెనీ వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 12 మిలియన్ వాహనాల నుండి 9 మిలియన్లకు తగ్గించుకుంది. గతంలోనే 50వేల మంది ఉద్యోగులను తగ్గించుకుంటామని ప్రకటించగా.. ఇప్పుడు ఆ సంఖ్యను ఏకంగా లక్షకు పెంచడం కార్పొరేట్ వర్గాల్లో సంచలనంగా మారింది.
►ALSO READ | ప్యాకేజింగ్‌పై 100% మోసాలకు చెక్: రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వం.. కంపెనీలకు చట్టపరమైన షాక్
ఈ లేఆఫ్స్ ప్లాన్‌ను అమలు చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే కంపెనీ సూపర్వైజరీ బోర్డులో సగం సీట్లు కార్మిక సంఘాల ప్రతినిధులవే ఉంటాయి. సీఈఓ ప్రతిపాదనలపై జర్మనీ కార్మిక సంఘం 'ఐజీ మెటల్' ఇప్పటికే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కంపెనీ ఇలాంటి నిర్ణయాలతో ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తోందని, ఒకవేళ ఈ ప్లాన్స్‌తో ముందుకు వెళ్తే తమ శక్తినంతా ఉపయోగించి అడ్డుకుంటామని హెచ్చరించింది. సో వచ్చే నెల జరగబోయే బోర్డు మీటింగ్‌లో ఈ లేఆఫ్స్ డ్రామా ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి మరి.
