ప్యాకేజింగ్‌పై 100% మోసాలకు చెక్: రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వం.. కంపెనీలకు చట్టపరమైన షాక్

ప్యాకేజింగ్‌పై 100% మోసాలకు చెక్: రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వం.. కంపెనీలకు చట్టపరమైన షాక్

సూపర్‌మార్కెట్‌కు వెళ్లినప్పుడు ఫుడ్ ప్యాకెట్లపై పెద్ద అక్షరాలతో '100% ప్యూర్', '100% నేచురల్' అని రాసి ఉండడం మనం చూస్తుంటాం. ముందరి భాగంలో ఉన్న ఆ మెరిసే అక్షరాలను చూసి మనం నిజమేనని నమ్ముతాం. ప్యాకెట్ వెనక భాగంలో మాత్రం చిన్న అక్షరాలతో అసలు నిజాలు, కండిషన్లు దాచేస్తుంటారు. ప్రముఖ కన్స్యూమర్ బ్రాండ్లు చేస్తున్న ఈ తరహా మార్కెటింగ్ ట్రిక్స్‌పై ఇప్పుడు భారత ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. వినియోగదారులను తప్పుదోవ పట్టించే ఇలాంటి పద్ధతులకు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వ నియంత్రణ సంస్థలు సంచలన నిర్ణయాలు తీసుకున్నాయి.

ప్రభుత్వ సంస్థల ఉమ్మడి దాడి:
కేంద్ర వినియోగదారుల రక్షణ అథారిటీ(CCPA), భారత ఆహార భద్రత-ప్రమాణాల సంస్థ(FSSAI) సంయుక్తంగా ఈ మోసపూరిత విధానాలపై క్రాక్‌డౌన్ ప్రారంభించాయి. నిబంధనలలోని లొసుగులను వాడుకుంటూ.. సాంకేతిక అర్హతలను సాకుగా చూపుతూ కంపెనీలు చేసే ఇటువంటి ప్రకటనలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. నిబంధనలను అతిక్రమించిన పలు బడా బ్రాండ్లకు ఇప్పటికే భారీగా జరిమానాలు కూడా విధించింది. సగటు వినియోగదారుడు ప్యాకెట్‌పై '100%' అని చూడగానే.., ఆ ఉత్పత్తి పూర్తిగా ఆ ఒక్క పదార్థంతోనే తయారైందని నమ్ముతాడని, కాబట్టి వెనుక వైపు డిస్‌క్లైమర్లు దాచడం చట్టవిరుద్ధమని సీసీపీఏ స్పష్టం చేసింది.

ఎఫ్ఎస్ఎస్ఏఐ కీలక నిషేధం:
ఈ సమస్యను సమూలంగా నిర్మూలించడానికి FSSAI ఒక అడుగు ముందుకు వేసి.. ఫుడ్ లేబుల్స్, ప్యాకేజింగ్, ప్రకటనలలో '100%' అనే పదాన్ని ఉపయోగించడాన్ని పూర్తిగా నిషేధిస్తూ అడ్వైజరీ జారీ చేసింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ కింద ఈ '100%' అనే పదానికి ఎలాంటి శాస్త్రీయ నిర్వచనం లేదని పేర్కొంది. ఇటువంటి ట్యాగ్‌లు మార్కెట్లోని ఇతర బ్రాండ్లు నాసిరకమైనవనే తప్పుడు ఇంప్రెషన్‌ను క్రియేట్ చేస్తున్నాయని ప్రభుత్వం గుర్తించింది. ఇందులో భాగంగానే గతంలో కాన్సెంట్రేట్ల నుంచి తయారుచేసే ఉత్పత్తులపై '100% ఫ్రూట్ జ్యూస్' అనే ట్యాగ్‌లను తొలగించాలని కంపెనీలను ఆదేశించిన సంగతి తెలిసిందే.

ఇకపై అడ్వర్టైజింగ్ రూల్స్ ప్రకారం.. ప్యాకెట్లపై చేసే ప్రతి క్లెయిమ్ స్పష్టంగా ఎలాంటి గందరగోళం లేకుండా, శాస్త్రీయంగా నిరూపించదగినదిగా ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. బ్రాండ్ పేరు పక్కనే.. ఆ ఉత్పత్తిలో ఉపయోగించిన ప్రధాన పదార్థాల వివరాలను ప్యాకెట్ ముందరి భాగంలోనే స్పష్టంగా ప్రింట్ చేయాలని ప్రభుత్వం ఇప్పుడు తప్పనిసరి చేస్తోంది. ఈ సరికొత్త ప్రభుత్వ నిర్ణయాలతో ఫుడ్ బ్రాండ్ల క్రియేటివ్ మార్కెటింగ్‌కు బ్రేక్ పడనుంది.