సౌత్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్, బాలీవుడ్ యాక్టర్ శ్రేయాస్ తల్పడే కలిసి నటిస్తున్న థ్రిల్లర్ మూవీ ‘ది ఇండియా స్టోరీ’ (The India Story). జూలై 24న హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా తాజాగా (జూన్ 26న) మేకర్స్ టీజర్ విడుదల చేశారు. బాంబే హైకోర్టు బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కోర్ట్‌రూమ్ డ్రామాలో కాజల్ అడ్వకేట్ ‘అర్చనా’ అనే పవర్‌ఫుల్ లాయర్‌గా, శ్రేయాస్ తల్పడే ఆందోళనలో ఉన్న ‘యోగేష్ పాటిల్’ అనే తండ్రి పాత్రలో కనిపించనున్నారు.
ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ఆసక్తిని పెంచగా, టీజర్ మరింత లోతుగా సాగి ఆలోచింపజేసింది. ఆహార కల్తీ, వ్యవసాయంలో రసాయనాలు, పురుగుమందుల అధిక వినియోగం వెనుక ఉన్న కుంభకోణాల వ్యవహారాన్ని గట్టిగా ప్రశ్నించబోతుందని మరోసారి టీజర్ ద్వారా క్లారిటీ వచ్చింది.
టీజర్ ఎలా ఉందంటే?
భారీ కార్పొరేట్ సంస్థల అక్రమ వ్యాపారాలు, పురుగుమందుల దుర్వినియోగం కారణంగా యోగేష్ జీవితంలో విషాదం చోటుచేసుకుంటుంది. ఆ తర్వాత న్యాయం కోసం అడ్వకేట్ అర్చనాతో కలిసి ఆయన చేసే పోరాటమే ఈ కథకు ప్రధానాంశంగా ఉంటుంది. సామాజిక అడ్డంకులు, ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటూ ఈ ఇద్దరూ న్యాయం కోసం పోరాడుతారు. అదే సమయంలో పురుగుమందుల ఆధారిత వ్యవసాయం వెనుక దాగి ఉన్న ప్రమాదకర వాస్తవాలను వెలికితీస్తారు. దేశంలోని ప్రతి కుటుంబాన్ని ప్రభావితం చేసే ఈ సమస్యపై సమాజంలో చర్చ మొదలుపెట్టడమే సినిమా ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.
ఈ సినిమా గురించి కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ..‘‘ది ఇండియా స్టోరీ’ బలమైన సామాజిక సందేశాన్ని కలిగిన సినిమా. ఒక తల్లిగా ఈ కథ నన్ను వ్యక్తిగతంగా ఎంతో ప్రభావితం చేసింది. నేటి తల్లిదండ్రుల్లో ఉన్న భయాలు, ఆందోళనలను ఈ చిత్రం ప్రతిబింబిస్తుంది’’ అని పేర్కొన్నారు.
నటుడు శ్రేయాస్ తల్పడే మాట్లాడుతూ, ‘‘పురుగుమందుల ఆధారిత వ్యవసాయం ప్రతి ఇంటిని ప్రభావితం చేసే సమస్య. కానీ దాని పరిణామాల గురించి మనం చాలా అరుదుగానే ఆలోచిస్తాం. నా పాత్ర ప్రయాణం ద్వారా ఒక సాధారణ తండ్రి వ్యవస్థకు వ్యతిరేకంగా చేసే భావోద్వేగ పోరాటాన్ని ప్రేక్షకులు అనుభూతి చెందుతారని ఆశిస్తున్నాను. ఇది కేవలం వినోదం కోసం మాత్రమే కాదు, సమాజంలో ఒక ముఖ్యమైన చర్చకు నాంది పలికే కథ’’ అని అన్నారు. సాగర్ బి షిండే నిర్మించిన ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ విడుదల చేస్తోంది.
