దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'వారణాసి'. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ మూవీపై అంచనాలు రెట్టింపు స్థాయిలో నెలకొన్నాయి. అయితే లేటెస్ట్ గా ఈ మూవీకి సంబంధించిన కీలక అప్డేట్ వివరాలను జక్కన్న పంచుకున్నారు. అటు ఇటీవల ఈ చిత్రంపై వస్తున్న రూమర్స్ కు చెక్ పెట్టారు
ఈ సినిమాకు సంబంధించిన మేజర్ పార్ట్, ముఖ్యంగా కళ్ళు చెదిరే భారీ యాక్షన్ సీక్వెన్స్‌ల షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం చిన్న చిన్న ఇంటర్‌కనెక్టింగ్ సీన్స్ తీస్తున్నారు. సెప్టెంబర్, అక్టోబర్ నాటికి టోటల్ షూటింగ్ పూర్తికానుందని తెలిపారు. ఈ గ్లోబ్-ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ విజువల్ వండర్ 7 ఏప్రిల్, 2027న థియేటర్లలోకి రానుందని వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందులతో ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉందంటూ వస్తున్న రూమర్స్ కు చెక్ పెట్టారు.
అయితే, గత దశాబ్ద కాలంగా సిటీలో ప్రాపర్ 'ఐమ్యాక్స్'(IMAX) స్క్రీన్ లేకపోవడం సగటు సినీ ప్రియుడిని ఎంతగానో నిరాశపరిచింది. ఒకప్పుడు ప్రసాద్స్ ఐమ్యాక్స్‌లో 70mm ప్రొజెక్టర్‌పై హాలీవుడ్ రేంజ్ విజువల్స్ చూసిన మన కళ్లకు, ఆ తర్వాత అది డిజిటల్‌గా మారడంతో ఆ కిక్ మిస్సయింది. అటు ఫ్యాన్స్ కూడా తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయంపై రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నంత సినిమా పిచ్చి ప్రపంచంలో ఎక్కడా ఉండదు. టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని సినిమాలను గుండెల్లో పెట్టుకుంటారు. అలాంటి ప్రేక్షకులకు ఐమ్యాక్స్ అనుభూతి దక్కకపోవడం అన్యాయం. ఎట్టకేలకు AMB గ్రూప్ హైదరాబాద్‌కి ఐమ్యాక్స్ స్క్రీన్‌ను తిరిగి తీసుకువస్తుండటం చాలా సంతోషంగా ఉంది అంటూ జక్కన్న ఎమోషనల్ అయ్యారు.
' వారణాసి ' మూవీ 'ఐమ్యాక్స్'స్క్రీన్ పై చూడబోతున్నారు. ఈ పాన్-వరల్డ్ ప్రాజెక్ట్‌లో గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా, మలయాళ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కె.ఎల్. నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా, ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
