మూసీపై రెండు వంతెనల వ్యధ.. హైదరాబాద్ వరదకు కారణం ఈ వంతెనలే..!

మూసీపై రెండు వంతెనల వ్యధ.. హైదరాబాద్ వరదకు కారణం ఈ వంతెనలే..!

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో  మూసీ నదిపై  చాలా  వంతెనలున్నాయి. అందులో  రెండు వంతెనలు నగరానికి  రెండు ముఖాలను చూపిస్తాయి.  ఒకటి  చారిత్రక ప్రాధాన్యం గల చాదర్‌‌‌‌‌‌‌‌ఘాట్ వంతెన,  రెండోది ఆధునిక డిజైన్‌‌‌‌‌‌‌‌తో  కూడిన  నాగోల్ వంతెన.  మొదటిది నగరం నడిబొడ్డున ఉక్కిరిబిక్కిరవుతుంది. రెండోది నగర శివారులో వరదను దాటించలేకపోతుంది. ఈ రెండు వంతెనల పరిస్థితి తెలిస్తే హైదరాబాద్ వరద  సమస్యకు అసలు కారణం బోధపడుతుంది.

నిజాం కాలంలో పాతబస్తీకి,  రెసిడెన్సీకి మధ్య వారధిగా  చాదర్‌‌‌‌‌‌‌‌ఘాట్ వంతెన నిర్మించారు. అప్పట్లో  ఎడ్లబండ్లు, గుర్రపు బగ్గీల కోసం కట్టిన ఈ వంతెన నేడు లక్షలాది వాహనాల భారాన్ని మోస్తోంది.  కోఠి, సుల్తాన్ బజార్, బేగంబజార్  వ్యాపార కేంద్రాలకు ఇది జీవనాడి.  ఇటీవలి కాలంలో  పిల్లర్ల  బలోపేతానికి చేపట్టిన పనుల వల్ల,  పిల్లర్ల  మధ్య ఖాళీ  కుంచించుకుపోయింది.  వర్షాకాలంలో  నీటితోపాటు వచ్చే వ్యర్థాలు ఈ ఇరుకు సందుల్లో చిక్కుకుపోతున్నాయి.  వంతెన కిందే అవరోధం ఏర్పడి,  నీరు వెనక్కి పొంగి కోఠి మార్కెట్‌‌‌‌‌‌‌‌ను ముంచెత్తుతోంది. 

మూసీనది వంపులో నాగోల్​ వంతెన

క్షేత్రస్థాయి  పరిశీలనల ప్రకారం,  గత కొన్ని దశాబ్దాలలో  చాదర్‌‌‌‌‌‌‌‌ఘాట్ వద్ద నది సహజ వెడల్పు గణనీయంగా తగ్గినట్లు కనిపిస్తుంది.  నది గర్భంలో విస్తృతంగా పార్కింగ్,  మెకానిక్ షెడ్లు వెలిశాయి. వర్షం రాగానే అవే మొదట మునుగుతాయి.  ఆ వాహనాలు,  సామగ్రి నీటి ప్రవాహానికి అడ్డుపడి వరద తీవ్రతను అనేక రెట్లు పెంచుతున్నాయి.  ఇక  నాగోల్ వంతెన ఔటర్ రింగ్ రోడ్‌‌‌‌‌‌‌‌లో భాగంగా  ఎల్బీ నగర్-– ఉప్పల్ ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌ను తగ్గించేందుకు నిర్మించారు. 

ఆధునిక డిజైన్,  వెడల్పాటి రోడ్డు, ఎత్తైన పిల్లర్లు, పైకి అన్నీ బాగానే కనిపిస్తాయి.  కానీ సమస్య వంతెనలో లేదు, కట్టిన ప్రదేశ స్వభావంలో ఉంది.  నాగోల్ వంతెన మూసీనది పెద్ద  మియాండర్ (వంపు తిరిగే) ప్రాంతంలో ఉంది. వరద  సమయంలో  నీరు నేరుగా పారదు.  మియాండర్  వద్ద  నీటివేగం తగ్గి ఒడ్డును బలంగా కోస్తుంది.  

ఫలితంగా 2020 అక్టోబర్ వరదల్లో  నాగోల్ వంతెన వద్ద నీటిమట్టం వంతెన స్థాయికి చేరి పక్కనే ఉన్న బండ్లగూడ, నాగోల్ కాలనీలు  ముంపునకు గురయ్యాయి.  నిపుణుల అభిప్రాయం ప్రకారం, వంతెన నిర్మాణ సమయంలో నది సహజ  వంపును  క్రమబద్ధీకరించే అవకాశం ఉన్నప్పటికీ,  వివిధ  పరిమితుల దృష్ట్యా అది సాధ్యపడలేదు. పిల్లర్లు ఎత్తైనవే అయినప్పటికీ,  వరద నీటిని పట్టి ఉంచేందుకు అవసరమైన వరద మైదానం అందుబాటులో లేకుండా పోయింది.  

తగ్గిన వరద మైదానం విస్తీర్ణం

వంతెనకు ఇరువైపులా కాలక్రమేణా నిర్మాణాలు వెలిశాయి.  దీనితో  వరద మైదానం విస్తీర్ణం తగ్గింది. 2023లో  నాగోల్ ప్రాంతంలోని  కొన్ని అపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ల  సెల్లార్లు మునిగి  వాహనాలు పాడయ్యాయి.  భారీ వర్షం వస్తే నీళ్లు పోవడానికి  తగినంత స్థలం లేకుండా పోయింది.  హైడ్రాలిక్  అధ్యయనాలు  చెబుతున్నదేమిటంటే,  భారీ వర్షాల  సమయంలో  మూసీలోకి చేరే నీటి పరిమాణం అధికంగా ఉంటుంది.  

కానీ ఆక్రమణల వల్ల  చాదర్‌‌‌‌‌‌‌‌ఘాట్,  నాగోల్ వంటి కీలక పాయింట్ల వద్ద నది మోయగలిగే  సామర్థ్యం గణనీయంగా తగ్గిపోయింది.  అందువలన మిగిలిన నీరు రోడ్ల మీదకు,  నివాస ప్రాంతాల్లోకి  చేరుతుంది.  చాదర్‌‌‌‌‌‌‌‌ఘాట్ చరిత్రకు సాక్షి..  నాగోల్ ఆధునికతకు  ప్రతీక.  మనం వంతెనలు నిర్మించాం,  నగరాన్ని విస్తరించాం,  పనిలో పనిగా  నది ప్రవాహానికి  కేటాయించిన స్థలాన్ని  కాలక్రమేణా  ఆక్రమించుకున్నారు. 

మరి పరిష్కార మార్గాలు ఏమిటి?

చాదర్‌‌‌‌‌‌‌‌ఘాట్ వంతెన వద్ద నది  సహజ స్వరూపాన్ని పునరుద్ధరించే  ప్రణాళిక అవసరం. నది ఉధృతిని తెలుసుకోవడానికి ఈ వంతెన వద్ద  రియల్ టైమ్  వాటర్ లెవల్  సెన్సర్ ఏర్పాటు చేసి, స్థానిక వ్యాపార సంఘాలకు  అనుసంధానించాలి.   నాగోల్ వంతెన వద్ద వంతెనకు ఎగువన,  దిగువన  నది  సహజ ప్రవాహానికి ఆటంకం కలగకుండా వరద మైదానాన్ని  శాస్త్రీయంగా  పునరుద్ధరించే ప్రణాళిక అవసరం.  నదీతీరంలో కొత్తగా నిర్మించే భవనాలకు 'స్టిల్ట్ ఫ్లోర్' విధానాన్ని తప్పనిసరి చేసి, సెల్లార్ల నిర్మాణాన్ని పరిమితం చేసే దిశగా ఆలోచించాలి. 

 చాదర్‌‌‌‌‌‌‌‌ఘాట్ నుంచి నాగోల్ వరకు  డ్రోన్ సర్వేతో  త్రీడీ మ్యాపింగ్ చేపట్టాలి.  ఎక్కడ వరద ముప్పు ఉందో  ముందుగానే గుర్తిస్తే  వర్షాకాలంలోపు నివారణ  చర్యలు  చేపట్టడానికి  వీలవుతుంది. చాదర్‌‌‌‌‌‌‌‌ఘాట్,  నాగోల్  వంతెనల  ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వ 'అమృత్ 2.0',  రాష్ట్ర ప్రభుత్వ పథకాల సమన్వయంతో  'అర్బన్ ఫ్లడ్ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్'  పైలట్  కేంద్రాలుగా  తీర్చిదిద్దవచ్చు. 

 స్మార్ట్ సిటీ  మిషన్ నిధులను వినియోగించుకుని   వర్షాకాలంలో వచ్చే  ఆస్తి నష్టాన్ని  నివారించే  అవకాశం ఉన్నది.  చాదర్‌‌‌‌‌‌‌‌ఘాట్ వంతెన గత కాలపు  దూరదృష్టికి  నిదర్శనం.  నాగోల్  వంతెన ఆధునిక ఇంజినీరింగ్‌‌‌‌‌‌‌‌కు నిదర్శనం.  కానీ  రెండూ వరదల్లో  మునుగుతున్నాయంటే  తప్పు  నది సహజ స్వభావాన్ని అర్థం చేసుకోని మనది. 

- డా. రామకృష్ణ మనిమద్దె,ఎర్త్ సైంటిస్ట్,  ఏహెచ్‌‌‌‌‌‌‌‌పీజీఐఎస్‌‌‌‌‌‌‌‌ & నదీ వ్యవస్థల నిపుణుడు-