ఖనిజ సంపద విదేశీ సంస్థల పరం..అధికారం చేతులు మారుతున్నా గిరిజన వ్యతిరేక విధానాలు మారడం లేదు

ఖనిజ సంపద  విదేశీ సంస్థల పరం..అధికారం చేతులు మారుతున్నా గిరిజన వ్యతిరేక విధానాలు మారడం లేదు

తరతరాలుగా అడవినే  కన్నతల్లిగా  భావించి జీవనం సాగిస్తూ, గిరిజన వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తూ  అనేకమంది గిరిజనులు అమరులు అయ్యారు.  అధికారం చేతులు  మార్చుకున్న తర్వాత దేశ పాలకులు కూడా గిరిజన వ్యతిరేక విధానాలు అమలు జరుపుతూ అటవీ ఖనిజ సంపదలను దేశ, విదేశీ బడా పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టే విధానాలు అమలుచేస్తున్నారు. అటవీ ఖనిజ సంపదను బడా సంస్థలకు కట్టబెట్టే విధానాలనూ వ్యతిరేకిస్తున్న గిరిజనులపై  నేడు మోదీ  ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది.  

భారతదేశంలో వివిధ రకాల విలువైన ఖనిజాలు అపారంగా ఉన్నాయి.  ముఖ్యంగా  ఒడిశా, జార్ఖండ్,  చత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్​,  కర్నాటక, గోవా,  బిహార్, ఆంధ్రప్రదేశ్,  తెలంగాణ, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ రాష్ట్రాల్లో  ఇనుప ఖనిజం, గ్రానైట్, బొగ్గు, మైకా,  సున్నపురాయి,  యురేనియం మొదలైన  ఖనిజాలు అడవుల్లో నిక్షిప్తమై ఉన్నాయి.  ప్రపంచంలో ఖనిజాలు అపారంగా ఉన్న దేశాల్లో  భారత్​మూడో స్థానంలో ఉంది.  

దేశ సహజ సంపదలైన ఖనిజాలు గిరిజనులకు హాని లేని విధంగా ప్రభుత్వ సంస్థలే బయటకు తీసి ప్రజల జీవితాలకు ఉపయోగపడేలా చేయాలి. అటవీ ఖనిజాలపై  ఆదివాసీ ప్రజలకు హక్కు ఉంది.  భారతదేశ ఖనిజ సంపదలపై దేశ ప్రజలు అందరికీ హక్కులు ఉంటాయని బ్రిటిష్  సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా ప్రారంభమైన జాతీయోద్యమం పేర్కొంది.  ఖనిజ  సంపద ఏ ఒక్కరి వ్యక్తిగత ఆస్తి కాదని చెప్పింది. 1947లో అధికార మార్పిడి జరిగిన తర్వాత గనులు,  ఖనిజ సంపదను జాతి సంపదగా గుర్తించి వాటి అభివృద్ధి చేసే  బాధ్యత  ప్రభుత్వాలపై ఉంది.   

విదేశాలకు తరలిపోతున్న దేశ ఖనిజ సంపద 

దేశ పాలకులు రాజ్యాంగం అప్పగించిన బాధ్యతను ఉద్దేశ పూర్వకంగా విస్మరించి, ఇతర రంగాల మాదిరిగానే ఖనిజ రంగాన్ని కూడా సామ్రాజ్యవాద  కంపెనీల  దోపిడీకి నెహ్రూ నుంచి మోదీ వరకు నిలయంగా మార్చారు.  మోదీ ప్రభుత్వం ఖనిజ సంపదను, గనులను, అటవీ భూములను ప్రైవేట్ వ్యక్తుల, బహుళజాతి సంస్థల పరం చేసేందుకు అడ్డంకిగా ఉన్న వాటిని తొలగించేందుకు  1980 అటవీ హక్కుల పరిరక్షణ చట్టంలో మౌలిక సవరణలు చేసింది. 

చంద్రబాబు నాయకత్వాన ఉన్న ఏపీ కూటమి ప్రభుత్వం గిరిజనులు పోరాటాల ద్వారా సాధించుకున్న 1/70 చట్ట సవరణకు పూనుకుని, తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావటంతో వెనక్కి తగ్గింది.  దేశ పాలకుల విధానాల ఫలితంగా దేశ ఖనిజ సంపద విదేశాలకు  తరలిపోతున్నది. 

భారతదేశంలో 95 రకాల    ఖనిజాలు  ఉత్పత్తి   అవుతున్నాయి. వీటి విలువ రూ. 25 లక్షల కోట్లు. 501 మిలియన్ టన్నుల బంగారు నిల్వలు ఉన్నాయి.  దేశం నుంచి కొన్ని లక్షల టన్నుల  ఖనిజాలు,  ముడి లోహాలు బహుళ జాతి సంస్థల  కార్ఖానాలకు,  గిడ్డంగులకు తరలిపోతున్నాయి. వీటి విలువ వేల కోట్ల రూపాయల్లో ఉంది. 

నిరంతరాయంగా ఖనిజ దోపిడీ

ఖనిజ వ్యాపారాల ద్వారా దేశ, విదేశీ వ్యాపార సంస్థలు వేల కోట్లు సంపాదిస్తున్నాయి. ఖనిజ 
నిక్షేపాలు ఎవరి నేలలో ఉన్నాయో, వాటిని ఎవరు తవ్వి తీస్తున్నారో వారి జీవితాలు మాత్రం దుర్భరంగా మారాయి. ముఖ్యంగా ఖనిజాలు ఉన్న ప్రాంతాలు ఆదివాసీ, 5వ షెడ్యూల్, 1/70,  ఒడిశాలో ఉన్న 2/70 చట్ట సవరణ  ప్రాంతాలుగా ఉన్నా, ఖనిజ దోపిడీ  నిరంతరాయంగా కొనసాగుతున్నది.  ఒడిశా, జార్ఖండ్,  చత్తీస్​గఢ్ రాష్ట్రాల్లోని ఖనిజ నిల్వలను  బహుళజాతి సంస్థలు  అక్రమంగా తరలించుకు పోతున్నాయి.   

భారత రాజ్యాంగం గనులను,  ఖనిజాభివృద్ధిని కేంద్ర, రాష్ట్రాల జాబితాలో చేర్చింది.  చమురు క్షేత్రాలు,  చమురు  సంబంధిత ఖనిజ విలువలు, పెట్రోలియం వాటి ఉత్పత్తులు, నియంత్రణ, అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తాయి.   కేంద్ర  ప్రభుత్వ పరిధిలో లేని  ఇతర గనులు,  ఖనిజాభివృద్ధి రాష్ట్రాల పరిధిలోకి వస్తాయని గనులు, ఖనిజాల చట్టం 1957 ద్వారా భారత  ప్రభుత్వం పేర్కొంది. ఈ చట్ట ప్రకారం అల్యూమినియం,  రాగి,  జింక్,  సీసం, బంగారం,  నిఖిల్  మొదలైనవి కేంద్ర ప్రభుత్వ గనుల శాఖ పరిధిలో ఉంటాయి.

మైనింగ్ రంగంలోకి బహుళజాతి సంస్థలు

1947 నుంచి భారతదేశ  పాలకులు గనుల రంగాన్ని ప్రైవేట్ వ్యక్తులకు, సంస్థలకు అప్పగించే విధానాలనే అనుసరించారు. 1957 చట్టంలోనే  గనుల  తవ్వకానికి ప్రైవేట్  వ్యక్తులకు, సంస్థలకు అప్పగించే వీలు కల్పించారు. 1960లో  వెలువడిన ఖనిజాల రాయితీ నిబంధనల్లో ప్రైవేట్ వ్యక్తులు, సంస్థల చేతికి ఖనిజ నిల్వలు కట్టబెట్టడానికి అవసరమైన విధి విధానాలు రూపొందించారు.  

దేశంలో  సరళీకరణ ఆర్థిక విధానాలు ప్రారంభమైన తర్వాత 1988లో వెలువడిన ఖనిజాల సంరక్షణ, అభివృద్ధి నిబంధనలు  ప్రైవేటీకరణ క్రమాన్ని  పెంచాయి. 1993లో  మొదటిసారిగా తయారైన జాతీయ ఖనిజ విధానం పూర్తిగా ప్రపంచీకరణ శక్తుల కనుసన్నల్లో బహుళజాతి సంస్థల ప్రయోజనాలు నెరవేర్చేవిధంగా తయారు చేశారు. 1994లో  మరోసారి చట్ట సవరణ చేసి ఇనుప ఖనిజం, రాగి, మాంగనీస్, సీసం, జింక్, గంధకం, బంగారం, వజ్రాలు మొదలైన ఖనిజాల్లోకి పెద్ద ఎత్తున ప్రైవేట్ సంస్థలు, బహుళజాతి సంస్థల ప్రవేశానికి అవకాశం కల్పించారు. ఈ అవకాశం ద్వారా  బహుళజాతి సంస్థలు నేరుగా,  దళారుల ద్వారా మైనింగ్ రంగంలోకి  ప్రవేశించాయి. 

దేశప్రజలకే చెందాలి

దేశ ఖనిజ  సంపద ద్వారా వ్యాపారం చేస్తున్న సంస్థలు- భారతదేశంలో జిందాల్ సౌత్ వెస్ట్, టాటా స్టీల్,  ఎస్సార్ స్టీల్,  యూకేకి చెందిన వేదాంత రిసోర్సెస్ మొదలైనవి  ముఖ్యంగా ఉన్నాయి. ఈ సంస్థలన్నీ భారత ఖనిజాల ద్వారా రూ.వేల కోట్లు లాభాలు పొందుతున్నాయి.  ఆదివాసీ ప్రజలు మాత్రం భూములు, నివాస ప్రాంతాలు కోల్పోయి నిరాశ్రయులు అవుతున్నారు.  ఖనిజాల వ్యాపారంలో విపరీతమైన లాభాలు ఉండటంతో స్థానిక పెత్తందార్లు, వ్యాపారులు, అధికారులు, రాజకీయ నాయకులు   కలగలసి మాఫియాగా ఏర్పడ్డారు. ఈ మాఫియా బహుళజాతి సంస్థలతో చేతులు కలిపింది. 

 ప్రభుత్వ అనుమతుల ప్రకారం గనులు తవ్వితేనే 99% లాభాలు వస్తుంటే, అక్రమ తవ్వకాల ద్వారా వచ్చే లాభాలను ఊహించలేం . వారికి వచ్చే లాభాల్లో ఒక శాతం మాత్రమే ప్రభుత్వ పన్నుల ద్వారా వసూలు చేస్తున్నది.  దేశ ఖనిజ సంపదలను దేశ,  విదేశీ సంస్థల పరం చేస్తున్న మోదీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ,  ఖనిజ  సంపద దేశ ప్రజలకే చెందాలని,1980  అటవీ హక్కుల చట్టంకు చేసిన  సవరణలను ఉపసంహరించాలని దేశ ప్రజలు సమష్టిగా ఉద్యమించాలి. 

- బొల్లిముంత సాంబశివరావు -