- రాతి కోట నుంచి 5 కిలోమీటర్ల పడవ ప్రయాణానికి ఏర్పాట్లు
- 150 అడుగుల కాల్వలు తవ్వి నీరు నింపాలని నిర్ణయం
- మొదటి దశలో కిలోమీటర్ బోటింగ్..
కాకతీయుల వైభవానికి ప్రతీకగా నిలిచిన ఖిలా వరంగల్ కోట మరోసారి సరికొత్త అందాలతో పర్యాటకులను ఆకర్షించేందుకు సిద్ధమవుతోంది. శతాబ్దాల క్రితం శత్రువులకు దుర్భేద్యంగా నిలిచిన ఈ కోట చుట్టూ ఉన్న జల కందకాలు(మోట్స్) ఇప్పుడు బోటు షికారుకు వేదిక కానున్నాయి. ఒకప్పుడు మొసళ్లు, విషసర్పాలతో రక్షణ కవచంగా ఉన్న ఈ కందకాలు.. ఇక చరిత్రను కళ్లముందు నిలబెడుతూ టూరిస్టులకు కొత్త అనుభూతి ఇవ్వనున్నాయి. మంత్రి కొండా సురేఖ ప్రత్యేక చొరవతో, కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో పనులు వేగంగా సాగుతున్నాయి. చరిత్ర వైభవానికి ఆధునిక హంగులు జోడిస్తూ ఖిలా వరంగల్‌ను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
వరంగల్, వెలుగు: కాకతీయుల రాజధాని ఖిలా వరంగల్ కోట సరికొత్త పర్యాటక కేంద్రంగా మారబోతోంది. ఇన్నాళ్లు కాకతీయుల పరిపాలన, వీరత్వం, శిల్పకళ వైభవానికి ప్రతీకగా నిలిచిన ఈ చారిత్రక ప్రదేశం.. టూరిస్టులకు కొత్త అనుభూతిని అందించేందుకు సిద్ధమవుతోంది. ఖిలా వరంగల్ ప్రస్తుతం వరంగల్ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉంది. కాకతీయుల రాజసాన్ని ప్రతిబింబించే ఈ కోట 700 ఏళ్ల తర్వాత కూడా వారసత్వ చిహ్నంగా నిలిచింది.
11వ శతాబ్దం చివర్లో గణపతిదేవుడు నిర్మాణం ప్రారంభించగా, రాణి రుద్రమదేవి 12వ శతాబ్దంలో పూర్తి చేశారు. రాజధాని చుట్టూ సుమారు 12.5 కిలోమీటర్ల మేర మట్టికోట, లోపల 5 కిలోమీటర్ల పరిధిలో రాతికోట నిర్మించారు. ఈ రెండు కోటల మధ్య రక్షణ కోసం అగర్తల జలకోటను ఏర్పాటు చేశారు. దాదాపు 150 అడుగుల వెడల్పుతో, 10 అడుగుల లోతుతో నీరు నింపి మొసళ్లు, విషసర్పాలను ఉంచేవారు. దీంతో శత్రువులు రాతికోటకు చేరడం అసాధ్యమయ్యేది. ఈ జలకోటను పునరుద్ధరించి బోటు షికారు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
మొదటి దశలో కిలోమీటర్ బోటు షికారు..
ఖిలా వరంగల్ కోటకు నిత్యం దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. ఇప్పటికే ఇక్కడ కోటలు, గుళ్లు, గుండు చెరువు, ఖుష్ మహల్ వంటి కట్టడాలు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావించింది. ఈ క్రమంలో కుడా ఆధ్వర్యంలో మూడు కోటలకు మరమ్మతులు చేపట్టడంతో పాటు, రాతికోటను ఆనుకుని ఉన్న అగర్తల్లో బోటు షికారు ప్రాజెక్ట్ ప్రారంభించారు.
మొదటి దశలో రూ.2 కోట్లకు పైగా నిధులతో ఒక కిలోమీటర్ మేర భూములు సేకరించారు. జేసీబీలతో 150 అడుగుల వెడల్పుతో అగర్తలను పునరుద్ధరిస్తున్నారు. త్వరలో నీరు నింపి, పరిసరాలను అందంగా తీర్చిదిద్ది బోటు షికారు అందుబాటులోకి తేనున్నారు.
ఆరు నెలల్లో అందుబాటులోకి..
ఓరుగల్లు టూరిజాన్ని పర్యాటకులకు మరింత దగ్గర చేయాలనే ఉద్దేశంతో ఖిలా వరంగల్‌ను అభివృద్ధి చేయాలని భావించాం. మంత్రి కొండా సురేఖ చొరవతో కోటకు పూర్వవైభవం తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. అప్పట్లో రక్షణ కోటగా ఉండే మోటు(అగడ్తల) కందకాలను తిరిగి తవ్వించి అందులో బోటు షికారుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఆరు నెలల్లో పనులు పూర్తి చేస్తాం.
- ఇనగాల వెంకటరమణారెడ్డి, కుడా చైర్మన్-
