45 రోజుల్లోగా BSF కు ల్యాండ్ అప్పగిస్తం..అంతర్జాతీయ సరిహద్దు నిర్వహణకు అడ్డంకులు ఉండవు

45 రోజుల్లోగా BSF కు ల్యాండ్ అప్పగిస్తం..అంతర్జాతీయ సరిహద్దు నిర్వహణకు అడ్డంకులు ఉండవు
  • బంగ్లాదేశ్​ బార్డర్​లో పూర్తిస్థాయి 
  • ఫెన్సింగ్ నిర్మాణం కోసం బదిలీ చేస్తం
  •  ఆయుష్మాన్ భారత్ అమలుకు గ్రీన్ సిగ్నల్
  •  తొలి కేబినెట్ భేటీ​లో బెంగాల్ సీఎం సువేందు నిర్ణయం

కోల్​కతా: పశ్చిమ బెంగాల్‌‌‌‌లో కొత్తగా ఏర్పాటైన సువేందు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌‌‌‌, బంగ్లాదేశ్‌‌‌‌ సరిహద్దుల్లో  ఫెన్సింగ్ (కంచె) ఏర్పాటు కోసం బీఎస్‌‌‌‌ఎఫ్‌‌‌‌కు భూమిని కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. సరిహద్దు ఫెన్సింగ్ కోసం అవసరమైన భూమిని బీఎస్‌‌‌‌ఎఫ్‌‌‌‌కు అప్పగించే ప్రాసెస్ సోమవారం నుంచే ప్రారంభిస్తున్నామని.. 45 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని స్పష్టం చేసింది. సోమవారం కోల్‌‌‌‌కతాలోని నబన్నలో సీఎం సువేందు అధికారి అధ్యక్షతన తొలి కేబినెట్ సమావేశం జరిగింది. అనంతరం సీఎం సువేందు మీడియాతో మాట్లాడారు. 

‘అంతర్జాతీయ సరిహద్దు నిర్వహణలో ఎదురవుతున్న అడ్డంకులను తొలగించడమే మా ప్రభుత్వ లక్ష్యం. గత తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఫెన్సింగ్ కోసం భూసేకరణలో ఆలస్యం చేసింది. దాంతో వేల కిలోమీటర్ల మేర ఫెన్సింగ్ పనులు ఆగిపోయాయి.

పశ్చిమ బెంగాల్​తో బంగ్లాదేశ్‌‌‌‌ 4,097 కి.మీ. సరిహద్దును పంచుకుంటుంది. ఇందులో ఇంకా సుమారు 850 కి.మీ. మేర ఫెన్సింగ్ పూర్తి కావాల్సి ఉంది. ఈ ప్రక్రియ పూర్తయితే దేశ భద్రత మరింత పటిష్టమవుతుంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి బీఎస్‌‌‌‌ఎఫ్‌‌‌‌కు  పూర్తి సహకారం అందిస్తాం. సరిహద్దు నియంత్రణను వారి చేతుల్లోకి వెళ్లేలా వేగంగా భూ బదలాయింపు చేస్తాం.

సరిహద్దులో ఫెన్సింగ్ ఏర్పాటు కోసం బీఎస్‌‌‌‌ఎఫ్‌‌‌‌కు భూమిని అప్పగించే ప్రక్రియను కేవలం 45 రోజుల్లోగా పూర్తి చేస్తాం" అని సువేందు పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో పాటు రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ అమలు, నూతన శిక్షా స్మృతి (బీఎన్ఎస్) అమలు, 2025 జనగణన ప్రక్రియను వెంటనే చేపట్టడం వంటి కీలక అంశాలపై కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.

గతంలో జరిగిన రాజకీయ హింసలో ప్రాణాలు కోల్పోయిన 321 మంది బీజేపీ కార్యకర్తల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని కూడా సీఎం ప్రకటించారు. తొలి కేబినెట్ సమావేశంలో 
మంత్రులు దిలీప్ ఘోష్, అగ్నిమిత్ర పాల్, నిశిత్ ప్రామాణిక్ తదితరులు పాల్గొన్నారు.