హైదరాబాద్, వెలుగు: ఆర్థిక నేరాలకు పాల్పడి.. విదేశాలకు పారిపోయే ఆర్థిక నేరస్తులకు ఏ దేశం కూడా సురక్షితమైన ఆశ్రయంగా మారకూడదని కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ (డీఓపీటీ) కార్యదర్శి రచన షా స్పష్టం చేశారు. అక్రమంగా తరలించిన ఆస్తులను స్వాధీనం చేసుకోవడంతో పాటు పరారీలో ఉన్న నేరస్థులను పట్టుకునేందుకు అంతర్జాతీయ స్థాయిలో పరస్పర సహకారం అత్యంత అవసరమని తెలిపారు.
హైదరాబాద్ లో మంగళవారం ప్రారంభమైన ‘రెండో బ్రిక్స్ యాంటీ కరప్షన్ వర్కింగ్ గ్రూప్ ’ రెండు రోజుల సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అవినీతి అనేది ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధికి అతిపెద్ద శత్రువుగా మారిందని, ఆస్పత్రులు, బడులు, ప్రాజెక్టులకు చేరాల్సిన ప్రజాధనాన్ని పక్కదారి పట్టిస్తూ వ్యవస్థలపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని దెబ్బతీస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రపంచంలో ఏ ఒక్క దేశం కూడా అవినీతి సవాళ్ల నుంచి మినహాయింపు పొందలేదన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా రూపాంతరం చెందుతున్న అవినీతిని అరికట్టేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానమే సరైన పరిష్కారమని ఆమె పేర్కొన్నారు. డిజిటల్ గుర్తింపు, ఈ-సేవలు, డిజిటల్ పేమెంట్లతో పాటు గవర్నమెంట్ ఈ-మార్కెట్ ప్లేస్ , డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ), పేపర్ లెస్ పన్నుల విధానం వంటి టెక్ -ఆధారిత సంస్కరణలు అవినీతిని అరికట్టడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని వివరించారు.
ఇదే సమయంలో ఫిన్‌టెక్, వర్చువల్ డిజిటల్ అసెట్స్ (క్రిప్టో వంటివి) దుర్వినియోగం చేస్తూ నిధులను రీసైక్లింగ్ చేస్తున్న కొత్త రకం నేరాలను అడ్డుకోవడంపై బ్రిక్స్ దేశాల ప్రతినిధులు తీవ్రంగా చర్చించారు. అంతకుముందు బ్రిక్స్ యాంటీ కరప్షన్ వర్కింగ్ గ్రూప్ చైర్మన్ జె. అశోక్ కుమార్ స్వాగత ఉపన్యాసం చేయగా.. నేరస్థుల గుర్తింపు, సమాచార మార్పిడికి సంబంధించిన పలు ప్రామాణిక పత్రాలు, టెంప్లేట్లపై సదస్సులో విస్తృత చర్చలు జరిగాయి.
