ఖమ్మం వరంగల్ జిల్లాలో.. భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తం

ఖమ్మం వరంగల్ జిల్లాలో.. భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తం

మహదేవపూర్/ పాల్వంచ, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్, కాటారం, పలిమెల మండలాల్లో సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు సుమారు 90 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. ఈదురుగాలులతో చెట్లు రోడ్లపై కూలిపోగా, కల్వర్టుల వద్ద రహదారులు కొట్టుకుపోయి గుంతలు ఏర్పడ్డాయి. ఎన్కపల్లి, రాపల్లి కోట, కిష్టారావుపేట గ్రామాలకు రాకపోకలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. రోజుకు ఒక్కసారి వచ్చే ఆర్టీసీ బస్సు రాకపోవడంతో విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడ్డారు. 

అనంతరం అధికారులు చర్యలు చేపట్టి రాకపోకలను పునరుద్ధరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో కురిసిన భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆయా కాలనీల్లో ఇళ్లలోకి వరద చేరగా, శ్రీనివాస కాలనీ శివాలయం వద్ద నీరు నిలిచి పాల్వంచ–దమ్మపేట రహదారిపైకి చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న డిప్యూటీ మేయర్ లలిత కుమారి, కార్పొరేటర్ నూకల సరిత, మున్సిపల్ కమిషనర్ సుజాత సంఘటనా స్థలాన్ని పరిశీలించి, వరద తొలగించే చర్యలు చేపట్టారు.