రూ. 3 వేల కోట్ల స్కాం కేసు .. హైదరాబాద్ ,విశాఖలో ఈడీ సోదాలు

రూ. 3 వేల కోట్ల స్కాం కేసు .. హైదరాబాద్ ,విశాఖలో ఈడీ సోదాలు

హైదరాబాద్‌ , విశాఖపట్నం లో ఈడీ సోదాలు కలకలం రేపుతున్నాయి. రూ.3 వేల కోట్లకు పైగా భారీ చిట్‌ఫండ్స్ కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దూకుడు పెంచింది.  

వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీల ఆర్థిక లావాదేవీలపై ప్రధానంగా దృష్టి సారించిన ఈడీ అధికారులు... ప్రముఖ వ్యాపారవేత్త, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్‌కు చెందిన నివాసాలు, కార్యాలయాలపై ఏకకాలంలో ఆగస్టు 5 ఉదయం నుంచి  దాడులు నిర్వహిస్తున్నారు. ఇరు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి.

ఈ సోదాల్లో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... స్థానిక అధికారులతో పాటు ప్రత్యేకంగా బిహార్‌కు చెందిన ఈడీ బృందాలు రంగంలోకి దిగడం గమనార్హం. బిహార్‌లో నమోదైన కొన్ని కేసుల ఆధారంగానే ఈ విస్తృత తనిఖీలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.చిట్‌ఫండ్స్ పేరుతో ప్రజల నుంచి వసూలు చేసిన నిధులను పెద్దఎత్తున దారి మళ్లించారనే ఆరోపణలు ఉన్నాయి.

ఈ కుంభకోణానికి సంబంధించి పక్కా ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు అధికారులు. హవాలా మార్గంలో లావాదేవీలు జరిగాయా? అనే కోణంలోనూ కూపీ లాగుతున్నారు.ఈ సోదాలు తెలుగు రాజకీయ, వ్యాపార వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.