- చరిత్రను తొక్కిపెట్టాలని చూస్తే దేశం సహించబోదని వార్నింగ్
న్యూఢిల్లీ: దేశంలోని విద్యార్థులు తీవ్ర ఆవేదనలో, గందరగోళంలో ఉన్నారని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. స్టూడెంట్లకు ప్రధాని నరేంద్ర మోదీ ‘క్షమాభిక్ష’ అవసరం లేదని, ప్రభుత్వ చర్యలకుగానూ ప్రధానే స్వయంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మంగళవారం మాజీ ఎంపీ వైకో పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్ గాంధీ మాట్లాడారు.
దేశ చరిత్రను తిరగరాసేందుకు ఆర్‌ఎస్‌ఎస్ ప్రయత్నిస్తుండటం వల్లే విద్యార్థులు రోడ్లెక్కి నిరసన తెలుపుతున్నారని అన్నారు. భారత చరిత్రను ఎవరైనా తొక్కిపెట్టాలని చూస్తే దేశం సహించబోదని హెచ్చరించారు. ప్రతి రాష్ట్రానికి సమాన ప్రాధాన్యం పొందేలా, తమ సొంత సంస్కృతి, భాషలను స్వేచ్ఛగా వ్యక్తపరిచే హక్కు ఉందని రాహుల్ గుర్తుచేశారు. ‘‘ఆర్‌ఎస్‌ఎస్ మాత్రం తాము నిర్దేశించిన చరిత్రనే అందరూ అనుసరించాలని కోరుకుంటోంది.
ఈ పోరాటం అందుకే జరుగుతోంది. ఉద్యోగాలు లేక, పరీక్షల్లో పారదర్శకత లోపించి, విద్యావ్యవస్థ సక్రమంగా పనిచేయక విద్యార్థులు తీవ్ర వేదనతో వీధుల్లోకి వచ్చారు. ఇలాంటి టైంలో ప్రధాని వారిని క్షమిస్తున్నానని మాట్లాడటం ఆశ్చర్యకరం. నన్ను గానీ, దేశ భవిష్యత్తు అయిన విద్యార్థులనుగానీ క్షమించడానికి ఆయన ఎవరు? ఈ ఆలోచన ఆయనకు ఎక్కడి నుంచి వచ్చిందో నాకర్థం కావడం లేదు’’ అని వ్యాఖ్యానించారు.
రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం
దేశం అనేది అనేక విభిన్న సంస్కృతుల కలయిక అనే విషయాన్ని మోదీ, ఆర్‌ఎస్‌ఎస్ అంగీకరించకపోవడమే ప్రమాదకరమైన ధోరణి అని రాహుల్ పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రకారం భారత్ అనేది రాష్ట్రాల సమాఖ్య అని స్పష్టం చేశారు. తమిళనాడు అని పిలిచినప్పుడు అందులో తమిళ ప్రజల సుదీర్ఘ చరిత్ర, వారి బాధలు, సంతోషాలు ముడిపడి ఉంటాయని వివరించారు.
తమిళ, మరాఠీ, బెంగాలీ ప్రజల విశిష్టతను అర్థం చేసుకోలేని కొందరు అజ్ఞానులు ఆయా చరిత్రలకు విలువ లేదని, ఆర్‌ఎస్‌ఎస్ ఆమోదించిన చరిత్ర మాత్రమే ముఖ్యమని భావిస్తున్నారని మండిపడ్డారు. ఇది రాజ్యాంగానికే విరుద్ధమని అన్నారు. ఈ సందర్భంగా దేశానికి వైకో చేసిన సేవలను కొనియాడిన రాహుల్ గాంధీ, ఆయన ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాత అని పేర్కొన్నారు.
