చందానగర్, వెలుగు: లిఫ్ట్‌లో ఇరుక్కుని ఓ మహిళ మృతిచెందింది. మృతురాలి భర్త, పోలీసుల వివరాల ప్రకారం.. నల్లగండ్ల ఎస్సీ కాలనీకి చెందిన దాడి శ్రీనివాస్ తన భార్య అనసూయ(43)తో కలిసి మంగళవారం చందానగర్‌లోని అన్నపూర్ణ ఎన్‌క్లేవ్‌లో ఉన్న చాట్వాజ్ మెన్షన్ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న మేనమామ దాడి గోవింద్‌ను పరామర్శించేందుకు వెళ్లారు.
గ్రౌండ్ ఫ్లోర్‌లోని లిఫ్ట్ వద్దకు చేరుకున్న తర్వాత శ్రీనివాస్ ముందుగా లిఫ్ట్‌లోకి ఎక్కాడు. అనసూయ లిఫ్ట్‌లోకి ఎక్కుతుండగా ఒక కాలు లోపల, మరో కాలు బయట ఉండగానే తలుపులు పూర్తిగా మూసుకోకముందే లిఫ్ట్ అకస్మాత్తుగా పైకి కదిలింది. దీంతో ఆమె లిఫ్ట్ డోర్ల మధ్య ఇరుక్కుపోయి తీవ్రంగా గాయపడింది. శ్రీనివాస్ కేకలు వేయడంతో అపార్ట్‌మెంట్ వాసులు, స్థానికులు చేరుకుని లిఫ్ట్‌ను నిలిపివేసి అనసూయను బయటకు తీసి చందానగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
లిఫ్ట్ మరమ్మతు పనులు జరుగుతున్న సమయంలో ప్రధాన విద్యుత్ సరఫరా నిలిపివేయకుండా, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకుండా పనులు నిర్వహించారని లిఫ్ట్ టెక్నీషియన్ అనిల్‌కుమార్‌పై మృతురాలి భర్త ఆరోపించారు. అపార్ట్‌మెంట్ అసోసియేషన్ సభ్యులు, లిఫ్ట్ నిర్వహణ సంస్థ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
