మహబూబాబాద్ జిల్లా భూపతిపేటలో మొసలి కలకలం రేపింది. ఎక్కడినుంచి వచ్చిందోగానీ వ్యవసాయబావిలో ప్రత్యక్షమైంది. మొసలిని చూసిన రైతు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. విషయం తెలుసుకున్న స్థానికులు మొసలిని చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రైతు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో మొసలిని సురక్షితంగా పట్టుకొని పాకాల సరస్సుకు తరలించారు. వివరాల్లోకి వెళితే..
మహబూబాబాద్ జిల్లాలో గూడూరు రేంజ్ పరిధిలోని భూపతిపేటకు చెందిన రైతు దేశిడి జితేందర్ రెడ్డి వ్యవసాయ బావిలో బుధవారం (ఆగస్టు5) మొసలి కనిపించింది. వ్యవసాయ పనులకోసం బావిదగ్గరకు వెళ్లిన రైతు..బావిలో మొసలిని చూసి షాక్ కు గురయ్యారు. విషయం తెలిసిన స్థానికులు మొసలిని చూసేందుకు క్యూగట్టారు. వ్యవసాయ బావిలో అంతపెద్ద మొసలిని చూసి ఆశ్చర్యపోయారు.
రైతులు ఇచ్చిన సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ సిబ్బంది మొసలిని సురక్షితంగా పట్టుకొని పాకాల సరస్సుకు తరలించారు. కాగా సమీపంలో ఉన్న చెరువులు ఈ మొసలి బావిలోకి వచ్చి ఉంటుందని భావిస్తున్నారు.
