వర్ధన్నపేట, వెలుగు: వరంగల్ జిల్లా వర్ధన్నపేట ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఇటీవల జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనలో 27 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఘటన అనంతరం మంగళవారం తల్లిదండ్రులు హాస్టల్‌లో నాసిరకం కూరగాయలతో మళ్లీ వంటలు చేస్తున్నారని ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేశారు. అలాగే హెచ్ఎం మద్యం సేవించి పాఠశాలకు వస్తారని, విద్యార్థులతో వెట్టిచాకిరి చేయిస్తారని, పాఠశాల ఆవరణలోనే సిగరెట్ తాగుతారని విద్యార్థులు ఆరోపిస్తూ ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి విద్యార్థులతో మాట్లాడారు. ఎమ్మెల్యే, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన త్రిసభ్య కమిటీ నివేదిక ఆధారంగా హాస్టల్ వార్డెన్ యాకూబ్ నిర్లక్ష్యమే ఫుడ్ పాయిజన్‌కు కారణమని ఉన్నతాధికారులు నిర్ధారించి ఆయనను సస్పెండ్ చేశారు.
అయితే, వార్డెన్ యాకూబ్‌కు ఈ ఘటనతో సంబంధం లేదని, ఆయనపై విధించిన సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తివేయాలని కోరుతూ విద్యార్థులు హాస్టల్ ఎదుట బైఠాయించి నిరసన చేపట్టారు. ఇన్‌చార్జి వార్డెన్‌గా ప్రధానోపాధ్యాయుడు వద్దని, పాత వార్డెన్‌ను కొనసాగించాలని లేదా కొత్త మహిళా వార్డెన్‌ను నియమించాలని నినాదాలు చేస్తూ రోడ్డుపై ధర్నా నిర్వహించారు. సమాచారం అందుకున్న ఏఎస్సై సాయిబాబు అక్కడికి చేరుకుని విద్యార్థులకు నచ్చజెప్పి హాస్టల్‌లోకి వెళ్లాలని సూచించడంతో వారు ఆందోళన విరమించారు. ఈ ఘటనతో భయబ్రాంతులకు గురైన కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను హాస్టల్ నుంచి ఇంటికి తీసుకెళ్లారు.
