కాశీబుగ్గ/ సుజాతనగర్, వెలుగు: సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఆగస్టు 5 నుంచి నాలుగు వారాల పాటు ‘సురక్ష కా తిరంగా-సైబర్ స్వతంత్ర తెలంగాణ’ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేతా రెడ్డి తెలిపారు. మంగళవారం సీపీ మాట్లాడుతూ పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసులు, బ్యాంకులు, వ్యాపార సంస్థలు, మహిళా సంఘాలు, ప్రజా ప్రదేశాల్లో సైబర్ అవగాహన సదస్సులు, ప్రతిజ్ఞ, ర్యాలీలు, పోస్టర్ల విడుదల, సోషల్ మీడియా ప్రచారం తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు.
ఇదే కార్యక్రమంపై భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఎస్పీ ఆఫీస్లో ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ స్టాక్ ఇన్వెస్ట్‌మెంట్, బిజినెస్ ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో జరుగుతున్న సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయాలని, ప్రతి ఒక్కరూ సైబర్ భద్రతపై అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. అనంతరం కార్యక్రమ నిర్వహణపై పోస్టర్ ఆవిష్కరణ చేశారు.
