భారత ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుతం ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. ఒక పక్క కేంద్ర బ్యాంకు ఆర్బీఐ తన గోల్డ్ రిజర్వ్స్ కుప్పలుకుప్పలుగా పెంచుకుంటూ పోతోంది. కేవలం 2024లోనే భారత్ ఏకంగా 72.60 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసి.. ప్రపంచంలోనే 2వ అతిపెద్ద కొనుగోలుదారుగా నిలిచింది. అయితే ఇదే సమయంలో ప్రధాని మోడీ మాత్రం సామాన్య ప్రజలు ఏడాది పాటు బంగారం కొనొద్దని పిలుపునిచ్చారు. ఈ డబుల్ గేమ్ వెనుక ఉన్న అసలు ఏం జరుగుతోందనే గందరగోళం ప్రతి భారతీయుడినీ వెంటాడుతోంది. గవర్నమెంట్ కొంటున్నప్పుడు మేమెందుకు మా అవసరాలకు బంగారం కొనుక్కోకూడదు అంటూ ప్రశ్నిస్తున్నారు చాలా మంది.
ప్రపంచవ్యాప్తంగా 'డీ-డాలరైజేషన్' అదే డాలర్ వాడకంపై ఆధారపడటం తగ్గించడం అనే ట్రెండ్ నడుస్తోంది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం తర్వాత అంతర్జాతీయ ఆంక్షల భయం పెరిగింది. ఒకవేళ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తలెత్తితే, విదేశీ బ్యాంకులు మన ఆస్తులను స్తంభింపజేసే ప్రమాదం ఉంది. అందుకే దేనికీ లొంగని, ఏ దేశ ఆర్థిక వ్యవస్థతోనూ సంబంధం లేని అసెట్ అయిన బంగారంపై ఆర్బీఐ దృష్టి సారించింది. 2021లో మన విదేశీ మారక నిల్వల్లో కేవలం 5.9% ఉన్న బంగారం వాటా.. మార్చి 2026 నాటికి ఏకంగా 16.7%కి పెరగడం రిజర్వు బ్యాంక్ భారీ బంగారు కొనుగోళ్లను సూచిస్తోంది.
విదేశాల నుంచి మన గోల్డ్ వెనక్కి:
RBI కేవలం బంగారం కొనడమే కాకుండా.. ఇతర దేశాల్లో భద్రపరిచిన మన బంగారాన్ని కూడా భారత్‌కు తిరిగి తీసుకొస్తోంది. 2023లో మన బంగారం నిల్వల్లో 38% మాత్రమే దేశంలో ఉండగా.. మార్చి 2026 నాటికి అది 77%కి చేరింది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వంటి విదేశీ సంస్థల వద్ద ఉంచితే అయ్యే ఖర్చును తగ్గించుకోవడమే కాకుండా, అత్యవసర సమయాల్లో మన బంగారం మన దగ్గరే ఉండాలనే సేఫ్టీ వ్యూహంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రజలను మోడీ ఎందుకు అడ్డుకుంటున్నారు?
మరి RBI అంతగా టన్నుల కొద్ది బంగారాన్ని కొంటుంటే.. ప్రజలను ఎందుకు కొనొద్దంటున్నారు? దీనికి కారణం ట్రేడ్ డెఫిసిట్. భారత్ తన అవసరాలకు కావాల్సిన బంగారాన్ని దాదాపు అంతా దిగుమతి చేసుకుంటుంది. క్రూడ్ ఆయిల్ తర్వాత భారత్ అత్యధికంగా విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు చేస్తోంది బంగారం దిగుమతుల కోసమే. ప్రజలు వ్యక్తిగతంగా టన్నుల కొద్దీ బంగారం కొంటే.. మన డాలర్ నిల్వలు హారతి కర్పూరంలా కరిగిపోతాయి. ఇది రూపాయి విలువను దారుణంగా పడగొడుతుంది. అందుకే దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు, డాలర్ల ప్రవాహాన్ని అరికట్టేందుకు ప్రధాని దేశ ప్రజలకు స్పెషల్ రిక్వెస్ట్ చేసారని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
దేశీయ అవసరాలు, వినియోగం..
ప్రస్తుతం దేశీయ బంగారం అవసరాల్లో 90 శాతం దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. దేశీయంగా ఏటా 1-2 టన్నుల బంగారం మాత్రమే ఉత్పత్తి జరుగుతుండగా అవసరాలు మాత్రం 700 నుంచి 800 టన్నులుగా ఉన్నాయి. ఈ ఏడాది జనవరి నెలలో ఏకంగా 100 టన్నుల గోల్డ్ దిగుమతి కాగా ఫిబ్రవరిలో అది 65 టన్నులుగా ఉంది. అయితే మార్చిలో 22 టన్నులకు తగ్గగా.. ఏప్రిల్ నెలలో గోల్డ్ దిగుమతులు భారీగా తగ్గి 15 టన్నులకు పరిమితం అయ్యాయి. దీంతో బంగారానికి డిమాండ్ ఏ స్థాయిలో తగ్గుతుందో అర్థం చేసుకోవచ్చు పెరిగిన రేట్లతో. దీనికి తోడుగా ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపు రానున్న రోజుల్లో బంగారానికి డిమాండ్ మరింత తగ్గించొచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
