గోల్డ్ కొనొద్దంటూ ప్రజలకు ప్రధాని మోడీ రిక్వెస్ట్.. కుప్పకూలిన జ్యూవెలరీ స్టాక్స్

గోల్డ్ కొనొద్దంటూ ప్రజలకు ప్రధాని మోడీ రిక్వెస్ట్.. కుప్పకూలిన జ్యూవెలరీ స్టాక్స్

ప్రధాని మోడీ భారతీయులను బంగారం ఏడాది పాటు కొనొద్దంటూ పిలుపునివ్వటం పెద్ద ప్రకంపనలకు దారితీసింది. ఉన్నట్టుండి గోల్డ్ అస్సలు కొనొద్దనటం ప్రజలకు అస్సలు మింగుడు పడటం లేదు. ఎందుకంటే గోల్డ్ కొనటం సాంప్రదాయంగా తరతరాలుగా భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో కీలకంగా ఉంది. అయితే మోడీ చేసి కామెంట్స్ జ్యూవెలరీ వ్యాపారుల నుంచి వ్యతిరేకత వస్తోంది. ఇప్పటికే రేట్లు పెరిగి బిజినెస్ తగ్గిందని బాధపడుతున్న వ్యాపారులు ప్రధాని పిలుపు పుండు మీద కారం జల్లినట్లుగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన జ్యువెలరీ కంపెనీల షేర్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. 

పుట్టినరోజు నుంచి పెళ్లిళ్ల వరకు గోల్డ్ లేనిదే ఏ శుభకార్యమూ జరగదు. కానీ ఇప్పుడు ఆ సెంటిమెంట్‌పై ప్రధాని చేసిన ఒక ప్రకటన స్టాక్ మార్కెట్‌లో భారీ సునామీని సృష్టించింది. దేశ విదేశీ మారక నిల్వలను కాపాడుకునేందుకు.. కనీసం ఏడాది పాటు బంగారం కొనుగోళ్లకు దూరంగా ఉండాలని పిలుపునివ్వడం జ్యువెలరీ రంగాన్ని ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది.

గోల్డ్ అండ్ జ్యూవెలరీ కంపెనీల పతనం:
ప్రధాని ప్రకటన వచ్చిన మరుసటి రోజే మార్కెట్ అల్లకల్లోలమైంది. పసిడిపై భారతీయుల మోజు తగ్గుతుందనే భయంతో ఇన్వెస్టర్లు తమ షేర్లను విక్రయించడానికి పోటీ పడ్డారు. దీని ప్రభావంతో దేశంలోనే అతిపెద్ద జ్యువెలరీ సంస్థ అయిన టైటాన్ షేర్లు సుమారు 6.6 శాతం పడిపోయాయి. ఇక సెన్కో గోల్డ్10.8 శాతం, కళ్యాణ్ జ్యువెలర్స్ 9.5 శాతం మేర కుప్పకూలి ఇన్వెస్టర్ల సంపదను ఆవిరి చేశాయి. ఇదే క్రమంలో పీసీ జ్యువెలర్స్, ముతూట్ ఫైనాన్స్, గోల్డియం ఇంటర్నేషనల్, రాజేష్ ఎక్స్ పోర్ట్స్, కేడీడీఎల్, డీపీ అభూషణ్, తంగమయిల్ జ్యువెలరీ, త్రిభోవందాస్ భీమ్జీ జావేరీ, రాధిక జ్యువెల్ టెక్ కంపెనీల షేర్లు కూడా 6 శాతం వరకూ పతనం అయ్యాయి. 

అసలు కారణం ఇదేనా?
గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న యుద్ధ మేఘాలు, ఇంధన కొరత కారణంగా భారత వాణిజ్య లోటు పెరుగుతోంది. క్రూడ్ ఆయిల్ తర్వాత భారత్ అత్యధికంగా ఖర్చు చేసేది బంగారం దిగుమతుల కోసమే. ఈ వ్యయాన్ని తగ్గించి రూపాయి విలువను నిలబెట్టాలనేది ప్రభుత్వ వ్యూహం. అటు బ్యాంకుల ద్వారా దిగుమతుల్లో ఎదురవుతున్న అడ్డంకులు, ఇటు ప్రభుత్వ నియంత్రణల భయం వెరసి జ్యువెలరీ స్టాక్స్‌ను పాతాళానికి నెట్టాయి సోమవారం రోజున.

శుభకార్యాలకు బంగారం కొనవద్దని ప్రధాని కోరడం అసాధారణమైన విషయమే అంటున్నారు నిపుణులు, వ్యాపారులు. సంప్రదాయాలకు ప్రాణమిచ్చే భారతీయులు ఈ పిలుపును ఎంతవరకు పాటిస్తారో చూడాలి. అయితే దలాల్ స్ట్రీట్ మాత్రం ఈ దెబ్బకు విలవిలలాడిపోతోంది. అయితే ఈ రంగంపై ప్రభావం తాత్కాలికమైనదేనా లేక సుదీర్ఘకాలం పాటు కొనసాగుతుందా అనేది వేచి చూడాల్సిందే మరి.