హైదరాబాద్: హైదరాబాద్లోని చందానగర్లో లిక్కర్ షాప్ను ఐటీ శాఖ అధికారులు అటాచ్ చేశారు. బినామీ యాక్ట్ కింద లిక్కర్ షాప్ సీజ్ చేశారు. హైదరాబాద్లో లిక్కర్ షాప్ పేరుతో జరుగుతున్న బినామీ బిజినెస్ దందా గుట్టును IT అధికారులు రట్టు చేశారు.
చందానగర్లో శ్రీ భవానీ వైన్స్ బినామీ షాప్గా నడుస్తున్నట్లు ఐటీ అధికారులు గుర్తించారు. ఎస్సీ రిజర్వేషన్లో సురేష్ అనే వ్యక్తి ఈ లిక్కర్ షాప్ దక్కించుకున్నాడు. తన ఆదాయం 4 నుంచి 5 లక్షలు చూపి, 21 లక్షలు చెల్లించిన లిక్కర్ లైసెన్స్ ఫీజును సురేష్ చెల్లించాడు.
అయితే.. ఒక్క నెలలోనే రూ.4.3 కోట్లు ఈ లిక్కర్ షాప్ రాబట్టడంతో ఐటీ అధికారులు ఈ వైన్స్ పై ఫోకస్ పెట్టారు. ఈ వ్యవహారంలో ప్రైవేట్ వ్యక్తులకు సురేష్ బినామీగా ఉన్నట్టు ఐటీ అధికారులు తేల్చారు. కేవలం పేరు మాత్రమే సురేష్ది అని గుర్తించారు. షాప్ తన పేరు మీద ఉన్నా సురేష్కు ఎలాంటి సంబంధం లేకుండా లావాదేవీలు కొనసాగడంతో ఈ వైన్స్ బినామీ బిజినెస్ వెలుగులోకి వచ్చింది.
