హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన రిటైర్డ్ ఐపీఎస్ భార్య హత్య కేసు.. ఏదో ఒకటి రెండు రోజులు ప్లాన్ వేసి చేసిన దోపిడీ హత్య కాదది. ఇంట్లో ఉన్న సొమ్మును ఎత్తుకెళ్లేందుకు పనిమనిషి వేసిన స్కెచ్ అసలే కాదు. ఈ ఘటన వెనుక ఇంటర్నేషనల్ గ్యాంగ్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కొన్ని నెలలుగా ప్లాన్ చేసిన స్కెచ్ అని పోలీసులు తేల్చారు. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
రిటైర్డ్ ఐపీఎస్ వినయ్ రంజన్ ఇంట్లో జరిగిన క్రైమ్ దోపిడీ వెనుక నేపాల్‌కు చెందిన సాహు గ్యాంగ్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ దోపిడీ కోసం ఢిల్లీ జైలు నుంచి స్కెచ్ వేసినట్లు తేల్చారు. పనిమనిషి ద్వారా కీలక ఆధారాలు సేకరించిన సాహు గ్యాంగ్.. ముంబై, నేపాల్, పాట్నా నుంచి వేర్వేరు వ్యక్తులను పనిమనిషి కల్పన ద్వారా రప్పించింది ముఠా.
కొన్ని రోజుల పాట్ స్కెచ్ వేసిన గ్యాంగ్.. రిటైర్డ్ ఐపీఎస్ రంజన్ భార్యను చంపేసి.. బంగారం, వెండి, డబ్బును ఎత్తుకెళ్లారు. దోపిడీ చేసిన బంగారాన్ని ముంబైలో దాచినట్లు గుర్తించారు. ఈ కేసులో పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కీలక సూత్రదారి కల్పన కోసం పుణెలో గాలిస్తున్నారు.
నిందితురాలు కల్పన పూణే సిటీలో ఉన్నట్లు అనుమానిస్తున్నారు. పట్టుకున్న ఇద్దరు నిందితుల ద్వారా కల్పన గురించి ఆరా తీగా ఆమె పుణెలో ఉన్నట్లు తేలింది. దీంతో స్పెషల్ టీమ్ ఒకటి పుణెకు వెళ్లింది. కల్పనను పుణెలో అరెస్టు చేసినట్టు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
అసలేం జరిగింది..?
జూబ్లీహిల్స్ లోని ప్రశాసన్ నగర్ లో ఉన్న ఐఏఎస్ క్వార్టర్స్ లో 2026 మే 07వ తేదీ అర్థరాత్రి దోపిడీ హత్య జరిగిన విషయం తెలిసిందే. రిటైర్డ్ డీజీ వినయ్ రంజన్ భార్య తనూజ (55) ను పని మనిషి కల్పన సహాయంతో హత్య చేసి, ఇంట్లో ఉన్న డబ్బు, నగలతో పారిపోయారు దుండగులు. తనూజను హత్య చేసి ఒక బ్యాగ్ తో ముగ్గురు పరారైనట్లు సీసీ ఫూటేజ్ ఆధారంగా పోలీసులు గుర్తించారు.
►ALSO READ | హైదరాబాద్లో పెళ్లికి వెళ్లొచ్చే సరికి ఇల్లు గుల్ల.. రూ.50 లక్షల బంగారం, వెండి, 5 లక్షల డబ్బులు చోరీ
అదే ఇంట్లో పనిచేస్తున్న నేపాలీ పనిమనిషి కల్పనతో పాటు మరో ముగ్గురు ఈ క్రైమ్ లో పాలుపంచుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. డబ్బు, ఆభరణాల కోసం తిన్నింటి వాసాలు లెక్కపెట్టడమే కాదు.. అన్నం పెట్టిన ఆ తల్లిని అన్యాయంగా పొట్టన పెట్టుకున్న పనిమనిషే ఇక్కడ అసలు సూత్రదారి. రంజన్ రే బెంగళూర్ వెళ్లటంతో.. తనూజ ఇంట్లో ఒంటరిగా ఉందనే సమాచారాన్ని పనిమనిషి మిగతా నిందితులకు చెప్పింది. పక్కా ప్లాన్ తో నలుగురు కలిసి హత్య చేసి పారిపోయారు.
