పద్మారావునగర్, వెలుగు: ఆస్తి తగాదాలతో కోడలు అత్తపై కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన హైదరాబాద్ చిలకలగూడలో జరిగింది. తీవ్రంగా గాయపడిన బాధితురాలు చికిత్సతో ప్రాణాపాయం నుంచి బయటపడింది. నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. చిలకలగూడ ఎరుకలబస్తీకి చెందిన దేవరాయ పద్మావతి(57) ఓ భవనంలోని మొదటి అంతస్తులో ఒంటరిగా నివసిస్తోంది.
ఆమె కోడలు విజయలక్ష్మి కుటుంబంతో కలిసి అదే భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉంటోంది. దివ్యాంగుడైన తన కొడుకు భవిష్యత్తు దృష్ట్యా ఆస్తిని పంచి ఇవ్వడానికి పద్మావతి నిరాకరిస్తుండటంతో కొన్నేళ్లుగా అత్తాకోడళ్ల మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి. మంగళవారం వరండాలో పద్మావతి ఒంటరిగా ఉండగా విజయలక్ష్మి కూరగాయలు కోసే కత్తితో పై అంతస్తుకు వెళ్లింది. పద్మావతి జుట్టు పట్టుకుని ఇంట్లోకి ఈడ్చుకెళ్లి మెడ, చేతులపై కత్తితో దాడి చేసింది.
బాధితురాలి కేకలు విన్న స్థానికులు అక్కడికి చేరుకుని ఆమెను రక్షించారు. తీవ్ర రక్తస్రావం కావడంతో గాంధీ ఆస్పత్రికి తరలించగా డాక్టర్లు శస్త్రచికిత్స చేసి ప్రాణాలు కాపాడారు. కోడలు అత్తపై దాడి చేసిన దృశ్యాలు ఇంట్లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు చిలకలగూడ ఇన్‌స్పెక్టర్ వలిశెట్టి రామకృష్ణ, ఎస్‌ఐ ఎండీ ఖాజా మొయినుద్దీన్ నిందితురాలు విజయలక్ష్మిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
