హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్‌లో డ్రగ్స్ నిర్మూలనకు పోలీసులు, నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్(హెచ్-న్యూ) చేపట్టిన చర్యల్లో గత ఏడాదిలో 563 ఎన్‌డీపీఎస్ కేసులు నమోదు కాగా, రూ.22.17 కోట్ల విలువైన నిషేధిత మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. జూన్ 2025 నుంచి ఈ ఏడాది జూన్ వరకు నమోదైన కేసుల్లో అత్యధికంగా జూబ్లీహిల్స్ జోన్‌లో 116 కేసులు నమోదయ్యాయి.
సికింద్రాబాద్ జోన్‌లో 99, గోల్కొండలో 95, చార్మినార్‌లో 90, రాజేంద్రనగర్‌లో 84, ఖైరతాబాద్‌లో 49, శంషాబాద్ జోన్‌లో 30 కేసులు నమోదయ్యాయి. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌లో రూ.12.56 కోట్ల విలువైన 2,513 కిలోల గంజాయి, రూ.6.91 కోట్ల విలువైన 55.3 లీటర్ల హాష్ ఆయిల్, రూ.1.62 కోట్ల విలువైన 1,626 గ్రాముల ఎండీఎంఏ, రూ.64.50 లక్షల విలువైన 129 గ్రాముల కొకైన్ ఉన్నాయి. అలాగే రూ.24 లక్షల విలువైన 120 గ్రాముల హెరాయిన్, రూ.17.10 లక్షల విలువైన 570 ఎల్‌ఎస్‌డీ బ్లాట్లు, రూ.1.25 లక్షల విలువైన 220 గ్రాముల ఓపీయం కూడా స్వాధీనం చేసుకున్నారు.
'ఆపరేషన్ థండర్‌బోల్ట్' కొనసాగింపు..
డ్రగ్స్ నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు, ఇటీవల హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మంగార్ బస్తీలో 1,100 మంది పోలీసులతో 'ఆపరేషన్ థండర్‌బోల్ట్' పేరిట భారీ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ దాడుల్లో గంజాయి, అక్రమ మద్యం పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రత్యేక ఆపరేషన్లు కొనసాగిస్తామని తెలిపారు. డ్రగ్స్ మూలాలను అరికట్టేందుకు ఎన్సీబీ, డీఆర్ఐ, ఈగల్ తదితర సంస్థలతో కలిసి పనిచేస్తున్నట్లు వెల్లడించారు.
హెచ్-న్యూ డీసీపీ పర్యవేక్షణలో అనుమానితులు, రౌడీషీటర్లు, వినియోగదారులకు డ్రగ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 1,550 మందికి పరీక్షలు నిర్వహించగా, 421 మందికి పాజిటివ్‌గా తేలింది. వ్యసనానికి గురైన వారిని గాంధీ ఆసుపత్రి, ఎర్రగడ్డ మానసిక ఆరోగ్య సంస్థతో పాటు పునరావాస కేంద్రాలకు తరలించి వైద్య చికిత్స, కౌన్సెలింగ్ అందిస్తున్నారు. నగరంలో డ్రగ్స్ మహమ్మారిని పూర్తిగా తరిమికొట్టేందుకు పోలీస్ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటోందని సిటీ సీపీ సజ్జనార్ చెప్పారు. డ్రగ్స్ రహిత హైదరాబాద్ నిర్మాణంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
