- కొనుగోలు చేసిన వాటిని సెంట్రలైజ్డ్ కిచెన్లకు సరఫరా
- 20.50 లక్షల మంది స్కూల్, ఇంటర్ విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్
- ప్రతిరోజూ లక్షా ఇరవై వేల కిలోల కూరగాయల అవసరం
హైదరాబాద్, వెలుగు: గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాల, ఇంటర్ విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడంతోపాటు స్థానిక రైతులకు మార్కెట్ కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి. చిన్నారెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ప్రజాభవన్‌లో రాష్ట్రవ్యాప్తంగా కూరగాయల సాగు, సేకరణపై చిన్నారెడ్డి అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అగ్రికల్చర్ సెక్రటరీ సురేంద్ర మోహన్, డైరెక్టర్ గోపి, ఏడీ విజయ్‌కుమార్, విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్, ఉద్యానవనశాఖ జాయింట్ డైరెక్టర్ రామలక్ష్మి, సెర్ప్ అధికారి రజితతోపాటు హరేకృష్ణ మిషన్, మన్నా ట్రస్ట్, అక్షయపాత్ర ప్రతినిధులు పాల్గొన్నారు.
రోజుకు 1.20 లక్షల కిలోల కూరగాయలు అవసరం..
రాష్ట్రవ్యాప్తంగా 20.50 లక్షల మంది పాఠశాల, ఇంటర్ విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ అందించేందుకు రోజుకు దాదాపు 1.20 లక్షల కిలోల కూరగాయలు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. స్థానిక రైతుల నుంచే నేరుగా కూరగాయలు సేకరించే విధానాన్ని అభివృద్ధి చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ప్రస్తుతం హరేకృష్ణ మిషన్, మన్నా ట్రస్ట్, అక్షయపాత్ర వంటి సంస్థల సహకారంతో గ్రామీణ విద్యార్థులకు ఆహారం అందజేస్తున్నారు. ఈ సంస్థలకు అవసరమైన కూరగాయలను రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేయడం ద్వారా రైతులకు మంచి ధర అందించవచ్చని అధికారులు భావించారు.
మహిళా రైతులకు ప్రాధాన్యం..
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు 39 సెంట్రలైజ్డ్ కిచెన్ల పరిధిలో కూరగాయల సాగును ప్రోత్సహించాలని నిర్ణయించారు. ఆయా కిచెన్ల పరిధిలో ఇప్పటికే కూరగాయలు సాగు చేస్తున్న రైతులతోపాటు కొత్తగా సాగు చేయడానికి ఆసక్తి చూపుతున్న రైతులను గుర్తించనున్నారు. మహిళా రైతులు, మహిళా సంఘాల ఆదాయ అవకాశాలు పెంచాలని నిర్ణయించారు. రైతులకు మార్కెట్, మంచి ధర లభించడంతోపాటు విద్యార్థులకు తాజా కూరగాయలతో పోషకాహారం అందేలా వ్యవస్థను రూపొందించనున్నారు.
ఈ నెల 17 నుంచి 20 వరకు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. కూరగాయలు సాగు చేస్తున్న రైతులు, మహిళా సంఘాలతో సమావేశాలు నిర్వహించనున్నారు. విత్తనాలు, సాగు సాంకేతికత, ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు, నీటి వసతి, మార్కెటింగ్, కూరగాయల సేకరణ, ధర తదితర అంశాలపై రైతుల అవసరాలను తెలుసుకుని కార్యాచరణ రూపొందించనున్నారు. 39 సెంట్రలైజ్డ్ కిచెన్ల అవసరాలకు అనుగుణంగా సమగ్ర ప్రణాళికను ఈ నెల 22లోపు సిద్ధం చేయాలని డాక్టర్ చిన్నారెడ్డి అధికారులను ఆదేశించారు.
