విద్యాశాఖ మంత్రిగా ఉండి కేయూకు ఏమీ చేయలేకపోయా: స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి

విద్యాశాఖ మంత్రిగా ఉండి కేయూకు ఏమీ చేయలేకపోయా: స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి

హసన్‌‌పర్తి, వెలుగు: విద్యాశాఖ మంత్రిగా పనిచేసినా కాకతీయ యూనివర్సిటీకి తాను ఏమీ చేయలేకపోయానన్న బాధ ఎప్పటికీ ఉంటుందని స్టేషన్‌‌ ఘన్‌‌పూర్‌‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మంగళవారం కేయూ సెనెట్‌‌ హాల్‌‌లో రిటైర్డ్‌‌ టీచర్స్‌‌ అసోసియేషన్‌‌ ఆధ్వర్యంలో నిర్వహించిన గోల్డెన్‌‌ జూబ్లీ వేడుకలకు ఆయన హాజరై మాట్లాడారు. రాజకీయాల్లోకి వచ్చిన 40 ఏళ్లలో సాధ్యమైనంత వరకు నిజాయితీగా ఉంటూ పేదల అభివృద్ధి, సంక్షేమం కోసమే పనిచేశానని తెలిపారు.

1987లో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చానని గుర్తుచేశారు. గత ప్రభుత్వ హయాంలో కాకతీయ యూనివర్సిటీ అభివృద్ధికి రూ.50 కోట్ల నిధులు మంజూరు చేశానని, అయితే కారణమేమిటో తెలియదుగానీ ఆ నిధులను వినియోగించుకోలేదని తెలిపారు. కార్యక్రమంలో రిటైర్డ్‌‌ టీచర్స్‌‌ అసోసియేషన్‌‌ అధ్యక్షుడు ఎ.సదానందం, కార్యదర్శి రవీందర్‌‌, సమ్మయ్య, వీరన్న, సుధాకర్‌‌, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.