బంగారం కొనొద్దంట.. పెట్రోల్ వాడొద్దంట.. మోదీ ఫెయిల్.. ఇవే ఫ్రూఫ్స్: రాహుల్

బంగారం కొనొద్దంట.. పెట్రోల్ వాడొద్దంట.. మోదీ ఫెయిల్.. ఇవే ఫ్రూఫ్స్: రాహుల్

బంగారం కొనొద్దని, పెట్రోల్ వినియోగం తగ్గించాలని దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ప్రజలను త్యాగాలు చేయమని మోదీ పిలుపునిస్తున్నారని.. బంగారం కొనొద్దని, విదేశాలకు వెళ్లొద్దని, పెట్రోల్ తక్కువ వాడాలని, ఫెర్టిలైజర్, కుకింగ్ ఆయిల్ వాడకం తగ్గించాలని.. ఉద్యోగులు మెట్రో వాడాలని.. ఉద్యోగులు వర్క్ ఫ్రం హోంకు ప్రియారిటీ ఇవ్వాలని మోదీ పిలుపునివ్వడం ప్రభుత్వ వైఫల్యాలకు నిదర్శనమని రాహుల్ ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. 12 ఏళ్లలో ప్రధాని మోదీ దేశాన్ని ఏ స్థాయికి వెనక్కి తీసుకెళ్లారో ప్రజలు గమనించాలని రాహుల్ సూచించారు.

ఏం కొనాలి, ఏం కొనకూడదు, ఎక్కడికి వెళ్లాలి, ఎక్కడికి వెళ్లకూడదు.. ఇలా ప్రతిసారీ జవాబుదారీతనాన్ని గాలికొదిలేసి.. మీరే భరించాలని ప్రజల మీదకు బాధ్యతలను నెట్టేయడం మోదీ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని రాహుల్ విమర్శించారు. 

ఇలా ఇన్నేళ్లుగా సంక్షోభం తలెత్తిన ప్రతిసారీ రాజీపడిన ప్రధానికి దేశాన్ని పాలించడం ఇకపై సాధ్యం కాదని రాహుల్ గాంధీ మండిపడ్డారు. దేశ ప్రజలకు మోదీ చేసిన సూచనలను విపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శించాయి. మోదీ ప్రభుత్వ అసమర్థతకు ఆయన చేసిన సూచనలు అద్దం పడుతున్నాయని విపక్షాలు ఎద్దేవా చేశాయి.

అసలు మోదీ చేసిన సూచనలేంటంటే..
యుద్ధం కారణంగా ప్రపంచం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఇలాంటి సమయంలో దేశం కోసం ప్రతి పౌరుడు కొన్ని త్యాగాలు చేయాలి. దేశ హితం కోసం ఏడాది వరకు ఎలాంటి శుభకార్యాలు, ఫంక్షన్లకు బంగారం కొనొద్దు. వంట నూనెల వాడకాన్ని కనీసం 10 శాతం తగ్గించాలి. పెట్రోల్, డీజిల్ పరిమితంగా వినియోగించాలి. స్వయం సమృద్ధి సాధించాలి.. విదేశీ మారక ద్రవ్యాన్ని మనం కాపాడుకోవాలి. 

ప్రజా రవాణా వ్యవస్థను వాడుకోవాలి. సరుకు రవాణాకు  రైల్వే సర్వీసులను వినియోగించండి.  ఎలక్ట్రిక్ వెహికల్స్‌‌ వినియోగం పెంచండి. కొవిడ్‌‌ తరహాలో వర్క్‌‌ఫ్రమ్ హోమ్, ఆన్‌‌లైన్ మీటింగ్‌‌లకు మళ్లీ ప్రాధాన్యత ఇవ్వాలి.  మధ్యతరగతి ప్రజలు ఖర్చులు తగ్గించుకోవాలి.  విదేశీ ప్రయాణాలు మానుకోవాలి.

ప్రధాని నరేంద్ర మోదీ