- స్త్రీ నిధి జాబ్స్ నోటిఫికేషన్లో రోస్టర్ ఏదీ?
- ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే 20 పోస్టులకు ప్రకటన
- అయినవారికే అందలం.. రూ.లక్షల్లో జీతాలు
- ఆరేళ్లుగా నాన్చి.. ఎండీ రిటైర్మెంట్ వేళ హడావుడి
- పరీక్ష లేకుండా.. కేవలం ఇంటర్వ్యూలతోనే భర్తీ ?
హైదరాబాద్, వెలుగు: స్త్రీ నిధి క్రెడిట్ కోఆపరేటివ్ సంస్థలో ఉద్యోగాల భర్తీ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆరేళ్లుగా ఖాళీలపై నోరు మెదపని అధికారులు.. తీరా ఎండీ పదవీకాలం ముగిసే సమయానికి హడావుడిగా నోటిఫికేషన్ విడుదల చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనలను తుంగలో తొక్కి, రోస్టర్ పాయింట్లను పక్కనబెట్టి, పైరవీకారులకే పట్టం కట్టేలా ఈ ప్రక్రియ సాగుతోందని ఉద్యోగవర్గాల్లో విమర్శలు వినిపిస్తున్నాయి. గత నెల 29న 20 పోస్టుల భర్తీకి స్త్రీ నిధి నోటిఫికేషన్ ఇచ్చింది.
ఈ నెల 20తో దరఖాస్తుల గడువు ముగియనుంది. అయితే, ఏ ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లోనైనా ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయో తెలిపే రోస్టర్ పాయింట్స్ ఉండాలి. కానీ, ఇందులో రోస్టర్ ఊసే లేదు. దీని వెనుక పెద్ద కుట్రే ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. కావాల్సిన వారితో పోస్టులు నింపుకోవడానికే ఇలా చేశారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ప్రభుత్వ పరిధిలోని ఏ సంస్థలోనైనా డైరెక్ట్ లేదా కాంట్రాక్ట్ నియామకాలు జరపాలంటే జీఓ నెం. 275 ప్రకారం ఆర్థిక శాఖ అనుమతి తప్పనిసరి. కానీ, స్త్రీ నిధి మేనేజ్మెంట్ సొంత నిర్ణయాలతోనే నోటిఫికేషన్ ఇచ్చిందని సమాచారం. ప్రస్తుత ఎండీ విద్యాసాగర్ రెడ్డి పదవీకాలం ఈ నెల 23తో ముగియనుంది. ఆ లోపే భర్తీ ప్రక్రియ ముగించాలని హడావుడి చేస్తున్నారు.
పరీక్ష నిర్వహించకుండా కేవలం ఇంటర్వ్యూల ద్వారానే ఎంపిక చేస్తుండటం వెనక అనుమానాలు ఉన్నాయి. పైగా, ఆఫీస్ కేడర్ ఉద్యోగులకు 58 ఏళ్లకే రిటైర్మెంట్ ఉండాలి కానీ, ఎండీ తన రిటైర్మెంట్ వయసును 63 ఏళ్లకు పెంచుకున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది.
లక్షల్లో జీతాలు ఫిక్స్..
గ్రామీణ మహిళలు రూపాయి రూపాయి కూడబెట్టుకున్న సొమ్ముతో నడిచే ‘స్త్రీ నిధి’లో వేతనాల పంపకం విచ్చలవిడిగా సాగుతోంది. నోటిఫికేషన్ లో పేర్కొన్న జీతాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. సీనియర్ ఐటీ కన్సల్టెంట్ కు రూ.2.25 లక్షలు, టీం లీడర్ కురూ. 2.25 లక్షలు, జనరల్ మేనేజర్ కు రూ. 2 లక్షలు, డిప్యూటీ జీఎం కు రూ. 1.50 లక్షలు.. వీటికి అదనంగా అలవెన్సులు. ఇలా ప్రైవేట్ కార్పొరేట్ సంస్థల కంటే ఎక్కువగా జీతాలు ఫిక్స్ చేయడం వెనుక తమ వారికి మేలు చేయాలన్న తపన కనిపిస్తోందని విమర్శకులు అంటున్నారు.
కాగా, గత ఏడాది ఏప్రిల్ లో కన్సల్టెంట్లుగా చేరిన 9 మందిని అర్ధాంతరంగా రెగ్యులరైజ్ చేయడం దుమారం రేపింది. మొత్తం 50 మందిలో కేవలం ఆ 9 మందికే ఎందుకు అవకాశం ఇచ్చారనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. తాజా నోటిఫికేషన్ పై ప్రభుత్వం, సంబంధిత మంత్రి విచారణ జరిపించాలని.. అర్హులైన నిరుద్యోగులకు న్యాయం చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది.
