మన స్టాక్ మార్కెట్లను కుప్పకూల్చిన ప్రధాని మోడీ కామెంట్స్.. అసలు ఏం జరుగుతోందంటే..?

మన స్టాక్ మార్కెట్లను కుప్పకూల్చిన ప్రధాని మోడీ కామెంట్స్.. అసలు ఏం జరుగుతోందంటే..?

ప్రధాని మోడీ దేశవ్యాప్తంగా ప్రజలకు బంగారం, విదేశీ ప్రయాణాలు, పెట్రోల్ వినియోగం, వర్క్ ఫ్రమ్ హోం, వంటనూనె వినియోగంపై చేసిన కామెంట్స్ స్టాక్ మార్కెట్లలో పెద్ద కుదుపుకు దారితీస్తున్నాయి. విమానయానం నుంచి గోల్డ్ స్టాక్స్ వరకూ ఆయా రంగాల్లోని లిస్టెడ్ కంపెనీల షేర్లు ఇవాళ ఇంట్రాడేలో నష్టాలను మూటకట్టుకున్నాయి. దీనికి తోడు క్రూడ్ ఆయిల్ ధరలు సహా మరిన్ని కారణాలు దేశీయ స్టాక్ మార్కెట్లను భారీ నష్టాల దిశగా నడిపిస్తున్నాయి. 

సోమవారం స్టాక్ మార్కెట్లు ప్రారంభం అయిన కొన్ని నిమిషాల్లోనే భారీ నష్టాల దిశగా ప్రయాణించటం స్టార్ట్ చేసాయి. దీంతో ఉదయం 10.22 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 1100 పాయింట్లకు పైగా నష్టంతో ఉండగా మరో కీలక సూచీ నిఫ్టీ 310 పాయింట్లు కుప్పకూలింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 880 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 562 పాయింట్ల పతనంతో ముందుకు సాగుతున్నాయి. 

మార్కెట్ పతనానికి దారితీసిన కీలక కారణాలు:

1. ముడిచమురు ధరల పెరుగుదల:
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఇరాన్ శాంతి చర్చల ప్రతిపాదనను "అంగీకారయోగ్యం కాదు" అని తిరస్కరించడంతో అంతర్జాతీయ మార్కెట్లో ఉద్రిక్తతలు పెరిగాయి. దీని ప్రభావంతో బ్రెంట్ క్రూడ్ ధర ఒక్కసారిగా 3.5 శాతం పెరిగి, బ్యారెల్‌కు105 డాలర్ల వద్దకు చేరుకుంది. చమురు ధరల పెరుగుదల ఎప్పుడూ భారత ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం ఉంటుంది.

2. ఇండియా విక్స్:
మార్కెట్లో నెలకొన్న భయాందోళనలను సూచించే ఓలటాలిటీ ఇండెక్స్ ఏకంగా 12 శాతం పెరిగి 18.82 స్థాయికి చేరింది. ఈ ఇండెక్స్ పెరగడం అనేది పెట్టుబడిదారులలో ఉన్న భయాన్ని అలాగే మార్కెట్ అస్థిరతను సూచిస్తుంది.

3. గోల్డ్ స్టాక్స్‌లో భారీ క్షీణత:
దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే క్రమంలో భాగంగా, బంగారం కొనుగోళ్లు, విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ఈ ప్రకటన తర్వాత జ్యువెలరీ రంగంలోని టైటాన్, సెన్కో గోల్డ్ వంటి ప్రముఖ కంపెనీల షేర్లు 9 శాతం వరకు కుప్పకూలాయి.