IPL 2026 Playoffs: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 తుది దశకు చేరుకుంది. ఆదివారం ఒక్క రోజే రెండు టీమ్స్ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాయి. ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చివరి బంతికి విజయం సాధించింది. అలాగే మరో మ్యాచ్‌లో లక్నోపై చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ రెండు మ్యాచ్‌ల ఫలితంతో ముంబై, లక్నో సూపర్ జెయింట్స్ అధికారికంగా ప్లేఆఫ్ రేసు తప్పుకున్నాయి. మిగిలిన 8 జట్లు టాప్-4లో నిలిచి ప్లేఆఫ్ బెర్తు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇప్పుడు 8 జట్ల ప్లేఆఫ్స్ లెక్కలని ఒకసారి పరిశీలిద్దాం..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : ఇప్పటి వరకు ఐపీఎల్ లో 11 మ్యాచ్ లు ఆడిన ఆర్సీబీ 14 పాయింట్లతో టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది. ఇక నెట్ రన్రేట్ (+1.103).. మరో మ్యాచ్ గెలిస్తే 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్ కి చేరుకుంటుంది. ఒకవేళ బెంగళూరు మిగతా 3 మ్యాచ్ లలో గెలిస్తే 20 పాయింట్లతో క్వాలిఫయర్-1కు నేరుగా చేరుకుంటుంది. అప్పుడు ఫైనల్ చేరడానికి రెండు ఛాన్స్ లు ఉంటాయి.
సన్ రైజర్స్ హైదరాబాద్: సన్ రైజర్స్ జట్టు కూడా 11 మ్యాచ్లో 7 విజయాలతో 14 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. కానీ, నెట్ రన్రేట్ (+0.737) తక్కువగా ఉండటంతో సెకండ్ ప్లేస్ లో కొనసాగుతుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇతర సమీకరణాలతో సంబంధం లేకుండా నేరుగా అర్హత సాధించాలంటే తమ చివరి 3 మ్యాచులలో రెండింటిలో గెలవాల్సిందే. మే 22వ తేదీన ఆర్సీబీతో జరిగే హైదరాబాద్ చివరి లీగ్ మ్యాచ్ క్వాలిఫయర్-1 స్థానాన్ని ఎవరు దక్కించుకుంటారో నిర్ణయిస్తుంది.
గుజరాత్ టైటాన్స్. గుజరాత్ జట్టు 11 మ్యాచులు ఆడి 14 పాయింట్లతో 3వ స్థానంలో ఉంది. ఆర్సీబీ, సన్ రైజర్స్ జట్లతో పోలిస్తే గుజరాత్ నెట్ రన్రేట్ (+0.228) తక్కువగా ఉంది. టైటాన్స్ ప్లేఆఫ్స్ కి చేరాలంటే తర్వాత ఆడే 3 మ్యాచ్ లలో రెండింట్లో తప్పక గెలవాల్సిన అవసరం ఉంది. మే 12న గుజరాత్, హైదరాబాద్ మధ్య జరగబోయే మ్యాచ్ ఇరు జట్లకు కీలకం కాబోతుంది.
పంజాబ్ కింగ్స్: ఐపీఎల్ లో 10 మ్యాచులు ఆడిన పంజాబ్ ఇప్పటికే 13 పాయింట్లు సాధించింది. చివరి నాలుగు మ్యాచులలో రెండింట్లో గెలిస్తే చాలు ఆ జట్టు 17 పాయింట్లతో సునాయాసంగా ప్లే ఆఫ్స్ బెర్తును చేరుకుంటుంది. ఢిల్లీ, ముంబై, ఆర్సీబీ, లక్నోలతో పంజాబ్ కింగ్స్ తమ తర్వాత మ్యాచులలో పోరాడాల్సిన అవసరం ఉంది.
చెన్నై సూపర్ కింగ్స్: ప్రస్తుతం 12 పాయింట్లతో ఉన్న చెన్నై కాస్త గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఈ జట్టు చివరి మూడు మ్యాచ్ లలో రెండింట్లో గెలిస్తే 16 పాయింట్ల వస్తాయి. కానీ, నెట్ రన్రేట్ (+0.185) తక్కువగా ఉండటం సీఎస్కేకి కొంచెం ఇబ్బందికరంగా మారింది. ఎల్లో ఆర్మీ నేరుగా అర్హత సాధించాలంటే మిగతా అన్ని మ్యాచులలో తప్పక గెలవాల్సిందే.
రాజస్థాన్ రాయల్స్: ఈ జట్టు కూడా ఇప్పటి వరకు 11 మ్యాచులలో 6 విజయాలు సాధించింది. మిగతా 3 మ్యాచ్లో కనీసం రెండింట్లో గెలిస్తే ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. గత 4 మ్యాచులలో మూడింట ఓడిపోవడంతో రాజస్థాన్ నెట్ రన్ రేట్ (+0.082) ఘోరంగా పడిపోయింది. ఈ టీమ్ నాలుగో స్థానం కోసం సీఎస్కేతో పోటీ పడే ఛాన్స్ ఉంది.
కోల్‌కతా నైట్‌రైడర్స్: కేకేఆర్ ప్లేఆఫ్స్ చేరుకోవడానికి చాలా తక్కువ ఛాన్స్ లు ఉన్నాయి.10 మ్యాచులు ఆడిన నైట్‌రైడర్స్ 9 పాయింట్లతో కొనసాగుతుంది. ఈ జట్టు 17 పాయింట్ల మార్కును చేరుకోవాలంటే మిగిలిన నాలుగు మ్యాచులలోనూ తప్పక గెలవాల్సిందే. ఒక్క మ్యాచ్లో ఓడినా చెన్నై, రాజస్థాన్ లాంటి ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంది.
ఢిల్లీ క్యాపిటల్స్: 11 మ్యాచ్లో నాలుగింట్లో గెలిచిన ఢిల్లీ సాంకేతికంగా మాత్రమే ప్లేఆఫ్స్ రేసులో నిలిచింది. ఈ జట్టు 14 పాయింట్లకు చేరుకోవడానికి మిగిలిన అన్ని మ్యాచ్లలోనూ గెలిచి తీరాల్సిందే. అలాగే ఇతర జట్ల ఫలితాలు కూడా తమకు అనుకూలంగా రావాలని ఢిల్లీ ఆశించాల్సింది.
