- రాణించిన టకెర్, డెలానీ
- బౌలింగ్‌లో చెలరేగిన హోలార్డ్, హంఫ్రీస్
బెల్‌ఫాస్ట్: టీ20 వరల్డ్ కప్ తర్వాత బరిలోకి దిగిన తొలి మ్యాచ్‌లో ఇండియా అట్టర్ ప్లాఫ్ అయ్యింది. ఛేజింగ్‌లో అభిషేక్ శర్మ (49) ఒంటరి పోరాటం చేసినా.. మిగతా బ్యాటర్ల వైఫల్యంతో ఓటమి తప్పలేదు. కెప్టెన్ లోర్కాన్ టకెర్ (50), గారెత్ డెలానీ (49) చెలరేగడంతో.. శుక్రవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఐర్లాండ్ 34 రన్స్ తేడాతో ఇండియాపై గెలిచింది. దాంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1–0 ఆధిక్యంలో నిలిచింది.
ఏ ఫార్మాట్‌లోనైనా టీమిండియాపై ఐర్లాండ్‌కు ఇదే తొలి విజయం. టాస్ ఓడిన ఐర్లాండ్ 20 ఓవర్లలో 182/9 స్కోరు చేసింది. తర్వాత ఇండియా 18.5 ఓవర్లలో 148 రన్స్‌కు ఆలౌటైంది. వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం కోసం ఎదురుచూసినా ఈ మ్యాచ్‌లో అతనికి చాన్స్ రాలేదు. హోలార్డ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
హర్షిత్‌కు 3 వికెట్లు..
ముందుగా బౌలింగ్‌కు దిగిన ఇండియా బౌలర్లు పిచ్ పరిస్థితులకు భిన్నంగా బంతిని స్వింగ్ చేయడానికి ప్రయత్నించలేదు. ఎక్కువగా షార్ట్ లెంగ్త్ బాల్స్‌తో ఐర్లాండ్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టారు. రీ ఎంట్రీ పేసర్ హర్షిత్ రాణా (3/24) పవర్‌ప్లేలోనే ఐర్లాండ్‌ను దెబ్బతీశాడు. టిమ్ టెక్టర్ (17), రాస్ అడైర్ (12)ను షార్ట్ పిచ్ బాల్స్‌ను ఫుల్ షాట్లు ఆడబోయి శ్రేయస్ అయ్యర్, శాంసన్‌కు క్యాచ్ ఇచ్చారు. ఆ వెంటనే అర్ష్‌దీప్ (2/28).. హ్యారీ టెక్టర్ (0)ను, శివమ్ దూబే (1/18).. బెన్ కాలిట్జ్ (15)ను ఔట్ చేయడంతో ఐర్లాండ్ 51/4తో నిలిచింది.
ఈ దశలో టకెర్, డెలానీ ఆదుకున్నారు. అక్షర్ పటేల్ (2/33) వేసిన 13వ ఓవర్లో టక్కర్ రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 35 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లోనూ వరుస బౌండరీలు బాదాడు. అయితే హర్షిత్ రాణా వేసిన షార్ట్ బంతిని పుల్ చేయబోయి తిలక్ వర్మకు క్యాచ్ ఇవ్వడంతో ఐదో వికెట్‌కు 64 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. చివర్లో ప్రసిధ్‌ను టార్గెట్ చేసిన డెలానీ 16వ ఓవర్‌లో ఓ ఫోర్, మూడు సిక్సర్లతో 27 రన్స్ దంచాడు. చివరకు అర్ష్‌దీప్ బాల్‌ను భారీ షాట్‌గా మల్చబోయి బౌండ్రీ వద్ద తిలక్‌కు చిక్కాడు. జార్జ్ డాక్రిల్ (19), లియామ్ మెకార్తీ (7), మాథ్యూ హంఫ్రీస్ (2) నిరాశపర్చారు.
అభిషేక్ ఒక్కడే..
ఛేజింగ్‌లో ఇండియా బ్యాటర్లు అట్టర్ ప్లాఫ్ అయ్యారు. అభిషేక్ శర్మ ఓ ఎండ్‌లో ఒంటరి పోరాటం చేసినా.. రెండో ఎండ్‌లో మిగతా బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఐర్లాండ్ బౌలర్లు మాథ్యూ హంఫ్రీస్ (3/38), మ్యాట్ హోలార్డ్ (3/28), జై ముంద్రా (2/25) వరుస విరామాల్లో వికెట్లు తీసి ఇండియాపై ఒత్తిడి పెంచారు. దాంతో రెండో ఓవర్‌లో సంజూ శాంసన్ (5) ఔట్‌తో మొదలైన వికెట్ల పతనం ఎక్కడా ఆగలేదు. నాలుగో ఓవర్‌లో ఇషాన్ కిషన్ (1), ఆరో ఓవర్‌లో శ్రేయస్ అయ్యర్ (3) ఔట్ కావడంతో పవర్‌ప్లేలో 68/3తో కష్టాల్లో పడింది.
8వ ఓవర్‌లో లియామ్ మెకార్తీ (1/29) అభిషేక్‌ను ఔట్ చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. మధ్యలో తిలక్ వర్మ (19), శివమ్ దూబే (25), అక్షర్ పటేల్ (15) కాసేపు బ్యాట్ అడ్డేసినా వికెట్ కాపాడుకోలేకపోయారు.
సుందర్ (9), హర్షిత్ రాణా (8), అర్ష్‌దీప్ సింగ్ (2), ప్రసిధ్ కృష్ణ (1 నాటౌట్) సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితం కావడంతో ఇండియా పూర్తి ఓవర్లు ఆడలేకపోయింది. 68 రన్స్ తేడాలో చివరి ఆరు వికెట్లు పడటంతో ఇండియాకు ఓటమి తప్పలేదు.
సంక్షిప్త స్కోర్లు
ఐర్లాండ్: 20 ఓవర్లలో 182/9 (టకెర్ 50, డెలానీ 49, హర్షిత్ రాణా 3/24).
ఇండియా: 18.5 ఓవర్లలో 148 ఆలౌట్ (అభిషేక్ 49, శివమ్ దూబే 25, మాథ్యూ హంఫ్రీస్ 3/38, హోలార్డ్ 3/28).
