- చైర్ పర్సన్‌తో పాటు మరో
- ఆరుగురు సభ్యుల నియామకం
- జీవో విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం
- చైర్ పర్సన్‌తో పాటు ఆరుగురు సభ్యుల నియామకం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్గా గద్వాల విజయలక్ష్మిని ప్రభుత్వం నియమించింది. చైర్ పర్సన్‌తో పాటు మరో ఆరుగురు సభ్యులను నియమిస్తూ.. సీఎస్ రామకృష్ణారావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మ, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ మనవరాలు చిట్యాల శ్వేతకు కమిషన్‌లో సభ్యులుగా ప్రభుత్వం చోటు కల్పించింది.
అలాగే, శశికళ యాదవ రెడ్డి, సదా లక్ష్మి, ఎన్.రాధా బాయి, ఉజ్మా అషాయ్ షకీరాను కూడా సభ్యులుగా నియమించింది. వీరంతా ఐదేండ్ల పాటు పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొంది. వీరి సర్వీస్ నిబంధనలు, జీతభత్యాలు, ఇతర సౌకర్యాలపై మహిళా శిశు సంక్షేమ శాఖ విడిగా ఉత్తర్వులిచ్చింది. రాష్ట్రంలో మహిళల రక్షణ, హక్కుల అమలు, వేధింపుల నిరోధం కోసం ఈ కమిషన్ పనిచేయనుంది. కాగా, శంకరమ్మ, శ్వేతకు కమిషన్‌లో చోటు కల్పించి తెలంగాణ ఉద్యమ కుటుంబాలకు ప్రభుత్వం పెద్దపీట వేసిందని, అలాగే, కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్న మహిళా నేతలకు కూడా ప్రాధాన్యత ఇచ్చిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
