ఇస్లామాబాద్: పాకిస్తాన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ మరోసారి భారత్‌పై ఆక్రోశం వెళ్లగక్కారు. భవిష్యత్‌లో పాకిస్తాన్‌పై ఇండియా ఎలాంటి దాడులకు పాల్పడిన ప్రతిదాడి మూములుగా ఉండదని ప్రగల్భాలు పలికారు. ఇండియా తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించారు. రావల్పిండిలోని జనరల్ హెడ్ క్వార్టర్స్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మునీర్ మాట్లాడుతూ.. "భవిష్యత్తులో ఇండియా పాకిస్థాన్‌పై ఏదైనా దుశ్చర్యకు పాల్పడితే ప్రతిదాడి ప్రభావం పరిమితంగా ఉండదు. అత్యంత విస్తృతంగా, ప్రమాదకరంగా, సుదూరంగా, బాధాకరంగా ఉంటుందని మన శత్రువులు తెలుసుకోవాలి’’ అని అన్నారు.
2025 మేలో ఇండియా, పాక్ మధ్య జరిగిన సంఘర్షణలో భారత్ కంటే పాకిస్తాన్ అవలభించిన వ్యూహాలే మెరుగైనవని బీరాలు పలికారు. గత సంవత్సరం జరిగిన సైనిక ఘర్షణ సమయంలో పాకిస్థాన్ సార్వభౌమత్వాన్ని దెబ్బతీయడానికి భారత్ విఫలయత్నం చేసిందని.. భారత్ చర్యలను పాకిస్తాన్ పూర్తి జాతీయ ఐక్యత, సైనిక బలంతో తిప్పికొట్టిందని పేర్కొన్నారు.
రెండు అణుశక్తి దేశాల మధ్య సంఘర్షణ కేవలం రెండు దేశాలు, సైన్యాల మధ్య జరిగే సాంప్రదాయ యుద్ధం మాత్రమే కాదని, వాస్తవానికి అది రెండు సిద్ధాంతాల మధ్య జరిగిన యుద్ధమని.. ఈ యుద్ధంలో అల్లా దయవల్ల సత్యం గెలిచి. అసత్యం ఓటమి ఓటమి పాలైందని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. 2025, మేలో ఇండియా, పాక్ మధ్య తలెత్తిన సైనిక ఘర్షణ ఆకస్మికంగా జరిగింది కాదని.. అది ఇండియా ఎత్తుగడలో భాగమని ఆరోపించారు. కాగా, పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా 2025 మే నెలలో ఇండియా చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌కు ఏడాది పూర్తి అయిన సందర్భంగా అసిమ్ మునీర్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
