చైనీస్ ఫైటర్ జెట్లపై బంగ్లాదేశ్ ఫోకస్..ఆపరేషన్ సిందూర్‌‌‌‌‌‌‌‌లో పాక్ వాడిన జే10సీఈ విమానాల కొనుగోలుకు సిద్ధం

చైనీస్ ఫైటర్ జెట్లపై బంగ్లాదేశ్ ఫోకస్..ఆపరేషన్ సిందూర్‌‌‌‌‌‌‌‌లో పాక్ వాడిన జే10సీఈ విమానాల కొనుగోలుకు సిద్ధం

న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ ఉపయోగించిన చైనాకు చెందిన జే10సీఈ ఫైటర్ జెట్‌‌‌‌ల కొనుగోలుకు బంగ్లాదేశ్ సిద్ధమవుతోంది. బంగ్లా ప్రధాన మంత్రి తారిఖ్ రెహమాన్ ఈ వారం చైనాలో పర్యటించనున్నారని, ఈ సందర్భంగా జే10సీఈ ఫైటర్ జెట్‌‌‌‌ల కొనుగోలు ప్రణాళికలను ముందుకు తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయని ఢాకాకు చెందిన ‘డైలీ వాదా’ పత్రిక వెల్లడించింది. 

ఒక్కో జే-10సీఈ ఫైటర్ ధర సుమారు 40 మిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. ఒకవేళ ఆగస్టులో ఒప్పందం కుదిరితే, 2026 చివరిలో లేదా 2027 ప్రారంభంలో జెట్‌‌‌‌ల సరఫరాలు ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. మొత్తం 24 విమానాల కోసం సుమారు 2.2 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకోనుందని తెలుస్తోంది. కాగా, జే-10సీఈ అనేది చెంగ్దూ జే-10సీ ఫైటర్ జెట్‌‌‌‌కు సంబంధించిన ఎగుమతి వెర్షన్ విమానం. పాకిస్తాన్ వద్ద ప్రస్తుతం 20 జే10సీఈ విమానాలు ఉండగా, మరో 16 కోసం ఆర్డర్ పెట్టింది. 

ఆపరేషన్ సిందూర్ సమయంలో జరిగిన వైమానిక ఘర్షణల్లో దీనిని పాక్ మోహరించింది. భారత వైమానిక దళానికి చెందిన సుఖోయ్-30ఎమ్‌‌‌‌కేఐ, జాగ్వార్, డస్సాల్ట్ రాఫెల్ వంటి జెట్లతో ఇది తలపడింది. జే 10సీఈ కొనుగోలు ఒప్పందం కార్యరూపం దాల్చితే.. బంగ్లాదేశ్ వైమానిక దళం(బీఏఎఫ్) సామర్థ్యంలో ఇది అత్యంత గణనీయమైన పురోగతిని సూచిస్తుంది.  

భారత్‌‌‌‌తో పోటీకి నో చాన్స్.. 

బంగ్లాదేశ్ 24 జే-10సీఈ ఫైటర్ జెట్‌‌‌‌లను కొనుగోలు చేసినా, భారత్ సైనిక శక్తితో పోటీనిచ్చే అవకాశం ఏమాత్రం లేదని రక్షణ రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. షిల్లాంగ్‌‌‌‌లో ప్రధాన కార్యాలయం ఉన్న భారత వైమానిక దళ తూర్పు కమాండ్, అస్సాం, బెంగాల్‌‌‌‌లలో సుఖోయ్ 30ఎమ్‌‌‌‌కేఐలు, డస్సాల్ట్ రాఫెల్‌‌‌‌లతో కూడిన సుమారు నాలుగు ఫైటర్ స్క్వాడ్రన్లు ఉన్నాయి. వీటిలో 60 నుంచి 70  ఫైటర్​ జెట్​లు ఎల్లప్పుడూ మోహరించి ఉంటాయి. అందుకే, చైనా నుంచి ఈ జెట్‌‌‌‌లను బంగ్లాదేశ్ కొనుగోలు చేసి, మోహరించినా.. భారత్‌‌‌‌కు కనీసం ఈశాన్యంలోనే పోటీ ఇచ్చే పరిస్థితి ఉండదు.