యూఏఈ నౌకపై.. ఇరాన్‌‌ మిసైల్‌‌ దాడి..వారంలో మూడుసార్లు దాడులు

 యూఏఈ నౌకపై.. ఇరాన్‌‌ మిసైల్‌‌ దాడి..వారంలో మూడుసార్లు దాడులు

అబుదాబి: హార్మూజ్‌‌ జలసంధిలో మరో నౌకపై ఇరాన్‌‌ దాడి చేసింది. అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ (ఏడీఎన్‌‌వోసీ)కి చెందిన చమురు నౌకపై శనివారం ఇరాన్‌‌ మిసైల్‌‌ దాడి చేసిందని యూఏఈ వెల్లడించింది. ఈ దాడిలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని యూఏఈ అధికారిక వార్తా సంస్థ ‘వామ్’తెలిపింది. ఈ దాడి వెనుక ఇరాన్ ప్రమేయం ఉందని యూఏఈ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఇరాన్‌‌ దాడి బాధ్యతారాహిత్యమైన చర్య అని మండిపడింది. 

తమ సిబ్బంది, నౌకలపై వరుసగా జరుగుతున్న దాడుల వల్ల తమ కంపెనీ కార్యకలాపాలు ప్రభావితమయ్యాయని ఏడీఎన్‌‌వోసీ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా ఇజ్రాయెల్ కూటమి, ఇరాన్‌‌ మధ్య యుద్ధం మొదలైనప్పటి నుంచి హార్మూజ్‌‌ జలసంధిలో తమ కంపెనీకి చెందిన 15 నౌకలపై మిసైల్స్, డ్రోన్లతో దాడులు జరిగినట్లు తెలిపింది. ఈ వారంలోనే మూడు దాడులు జరిగాయని తెలిపారు. ఇప్పటివరకు జరిగిన దాడుల్లో ఒక సిబ్బంది మరణించగా, మరో 20 మంది గాయపడ్డారని వెల్లడించింది.