కాంగోలో ఐసిస్ ఉగ్రవాదుల దాడి..13 మంది మృతి..ఇండ్లకు నిప్పుపెట్టి దోపిడీకి పాల్పడ్డ టెర్రరిస్టులు

కాంగోలో ఐసిస్  ఉగ్రవాదుల దాడి..13 మంది మృతి..ఇండ్లకు నిప్పుపెట్టి దోపిడీకి పాల్పడ్డ టెర్రరిస్టులు

కిన్షాసా: ఉగాండా సరిహద్దులోని కాంగోలో ఐసిస్ అనుబంధ 'అలైడ్ డెమోగ్రటిక్ ఫోర్సెస్' (ఏడీఎఫ్) ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. మంబాసా ప్రాంతీయ రాజధాని సమీపంలోని 'బనానా ఎకోల్' గ్రామంపై శనివారం తెల్లవారుజామున దాడికి పాల్పడడంతో 13 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం ఉగ్రవాదులు ఇండ్లకు నిప్పుపెట్టి దోపిడీకి పాల్పడ్డారు. గ్రామస్తులు ఎవరూ స్పందించకపోవడంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సివిల్ సొసైటీ ప్రతినిధి మేరీ-నోయెల్ అనోటే తెలిపారు.

ఎబోలా భయంతో వలసలు..

ఒకవైపు ఉగ్రదాడి భయం, మరోవైపు వేగంగా ప్రబలుతున్న ఎబోలా వ్యాధితో స్థానికులు ఇండ్లను వదిలి సురక్షిత ప్రాంతాలైన బూనియా వైపు పరుగులు తీస్తున్నారు. 2019లో ఐసిస్‌కు మద్దతు తెలిపిన ఏడీఎఫ్ సంస్థ కాంగోలో నిత్యం దాడులకు పాల్పడుతోంది. ప్రస్తుతం కాంగోలో దాదాపు 100కు పైగా తిరుగుబాటు గ్రూపులు చెలరేగుతుండగా, రువాండా మద్దతు ఉన్న 'ఎం23' రెబెల్స్ కీలక నగరాలను ఆక్రమించి దేశాన్ని అస్థిరపరుస్తున్నాయి.