వెనిజులాలో బుధవారం (జూన్ 24) 7.1 , 7.5 తీవ్రతతో వరుసగా రెండు భారీ భూకంపాలు వచ్చాయి. వీటివల్ల చాలా బిల్డింగ్‌లు కూలిపోయి పెద్ద ఎత్తున నష్టం జరిగింది. అయితే, భూకంపం రావడానికి కొన్ని సెకన్ల ముందే గూగుల్ నుండి మాకు అలర్ట్ మెసేజ్ వచ్చిందని కొంతమంది Xలో స్క్రీన్‌షాట్స్ షేర్ చేశారు. ఆ మెసేజ్‌లో దాదాపు 341 కిలోమీటర్ల దూరంలో 6.2 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు ఉంది. ఇంతకీ గూగుల్‌కు ఈ విషయం ఎలా తెలిసిందంటే... దానికి సమాధానం మన చేతిలో ఉండే స్మార్ట్‌ఫోనే!
గూగుల్ వాడే 'స్మార్ట్‌ఫోన్' నెట్‌వర్క్
ఈ రోజుల్లో వచ్చే ప్రతి స్మార్ట్‌ఫోన్‌లో యాక్సిలరోమీటర్ (Accelerometer) అనే చిన్న సెన్సార్ ఉంటుంది. సాధారణంగా మనం ఫోన్‌ను అడ్డంగా తిప్పినప్పుడు స్క్రీన్ ఆటోమేటిక్‌గా మారడానికి ఇది ఉపయోగపడుతుంది. కానీ, దీనితో మరో పవర్ ఫుల్ ఉపయోగం కూడా ఉంది. ఇది భూమిలో వచ్చే చిన్న చిన్న ప్రకంపనలను (వణుకును) కూడా గుర్తించగలదు.
సిగ్నల్ పంపడం: మీ ఫోన్ భూకంపం లాంటి ప్రకంపనలను గుర్తించిన వెంటనే... ఆ లొకేషన్ వివరాలతో సహా గూగుల్ 'ఆండ్రాయిడ్ భూకంప హెచ్చరికల వ్యవస్థ'కు ఒక సిగ్నల్ పంపుతుంది.
క్రాస్ చెకింగ్: గూగుల్ సర్వర్లు ఆ ప్రాంతంలోని మిగతా ఫోన్ల నుండి వచ్చే సమాచారాన్ని కూడా చెక్ చేస్తాయి. ఒకేసారి చాలా ఫోన్ల నుండి ఇలాంటి సిగ్నల్స్ వస్తే, అక్కడ నిజంగానే భూకంపం వస్తోందని గూగుల్ కన్ఫర్మ్ చేసుకుంటుంది.
ప్రపంచంలోనే అతిపెద్ద సీస్మోగ్రాఫ్: ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లకు పైగా ఆండ్రాయిడ్ ఫోన్లు ఉన్నాయి. వీటన్నింటినీ కలిపి గూగుల్ ప్రపంచంలోనే అతిపెద్ద భూకంపం కొలిచే నెట్‌వర్క్‌గా మార్చేసింది.
భూకంపం కంటే ఫోన్ సిగ్నల్ ఎలా వేగంగా వెళ్తుంది?
భూకంపం అనేది ఒకేసారి రాదు, అది తరంగాల (Waves) రూపంలో ప్రయాణిస్తుంది. ఇందులో రెండు రకాలు ఉంటాయి:
P-వేవ్స్: ఇవి చాలా వేగంగా (సెకనుకు 6 కి.మీ) ప్రయాణిస్తాయి, కానీ వీటి వల్ల పెద్దగా నష్టం జరగదు, కేవలం ప్రకంపనలు మాత్రమే వస్తుంది.
S-వేవ్స్ : ఇవి కొంచెం నెమ్మదిగా (సెకనుకు 3-4 కి.మీ) వస్తాయి, కానీ వీటి వల్లే బిల్డింగ్‌లు కూలిపోవడం లాంటి పెద్ద నష్టం జరుగుతుంది.
ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. మీ ఫోన్ మొదట వచ్చే P-తరంగాలను గుర్తించి వెంటనే గూగుల్ సర్వర్‌కు సిగ్నల్ పంపుతుంది. ఫోన్ సిగ్నల్స్ కాంతి వేగంతో (సెకనుకు దాదాపు 3 లక్షల కిలోమీటర్లు) ప్రయాణిస్తాయి. భూకంపం తరంగాల వేగం కంటే కాంతి వేగం చాలా చాలా ఎక్కువ కాబట్టి, నష్టం కలిగించే S-తరంగాలు మీ దాకా రాకముందే గూగుల్ సర్వర్లు అలర్ట్ మెసేజ్‌ను మీ ఫోన్‌కు పంపేస్తాయి.
వెనిజులా కేసులో కూడా ఇదే జరిగింది. భూకంప కేంద్రం 341 కిలోమీటర్ల దూరంలో ఉండటం వల్ల, ఆ ప్రమాదకరమైన తరంగాలు ప్రజలను చేరేలోపే గూగుల్ అలర్ట్ పంపించగలిగింది.
భూకంప తీవ్రతను బట్టి గూగుల్ ఆండ్రాయిడ్‌లో రెండు రకాల హెచ్చరికలు ఇస్తుంది:
*బీ అవేర్ అలర్ట్ (Be Aware Alert): తేలికగా వణుకు ఉన్నప్పుడు ఈ అలెర్ట్ వస్తుంది.
*టేక్ యాక్షన్ అలర్ట్ (Take Action Alert): భూకంపం బలంగా ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఈ అలెర్ట్ వస్తుంది.
ఈ అలర్ట్‌ల మీద క్లిక్ చేస్తే భూకంపం ఎక్కడ వచ్చింది, ఎంత తీవ్రతతో వచ్చింది అనే మ్యాప్‌తో పాటు... ఆ సమయంలో ప్రాణాలు ఎలా కాపాడుకోవాలనే టిప్స్ కూడా చూపిస్తుంది.
ఇండియాలో 2023 నుండి ఆండ్రాయిడ్ 5 అంతకంటే ఎక్కువ వెర్షన్ ఉన్న ఫోన్లలో ఈ సిస్టమ్ పనిచేస్తోంది. అయితే ఈ అలర్ట్స్ రావాలంటే మీ ఫోన్‌లో వైఫై లేదా మొబైల్ డేటా ఆన్‌లో ఉండాలి. ఒకవేళ మీకు ఈ అలర్ట్స్ వద్దు అనుకుంటే ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి దీన్ని ఆఫ్ చేసుకోవచ్చు.
