భద్రాచలం ఆలయ అభివృద్ధికి ముహూర్తం ఖరారు.. జూన్ 27 నుంచే పనులు

భద్రాచలం ఆలయ అభివృద్ధికి ముహూర్తం ఖరారు.. జూన్  27 నుంచే పనులు

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం.. దక్షిణ అయోధ్యగా ఖ్యాతి గాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం సరికొత్త వైభవానికి సిద్ధమవుతోంది.భద్రాద్రి రామాలయ అభివృద్ధి పనులకు  జూన్ 27వ తేదీన అధికారికంగా శ్రీకారం చుడుతున్నట్లు  మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటించారు. జూన్ 25న గురువారం సచివాలయంలో దేవాదాయ శాఖ ,ఆలయ అధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన ఈ కీలక నిర్ణయాన్ని వెల్లడించారు.

భక్తుల మనోభావాలకు అనుగుణంగా.. ఆగమశాస్త్ర నియమాలను కచ్చితంగా పాటిస్తూ ఈ ఆలయ అభివృద్ధి పనులు జరగనున్నాయి. భద్రాచలం ఆలయ పూర్వ వైభవానికి, ఆధ్యాత్మికతకు ఎటువంటి భంగం కలగకుండా.. సంప్రదాయ శిల్పకళను ప్రతిబింబించేలా రాతి నిర్మాణాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది.రాబోయే రెండు వందల సంవత్సరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని.. భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలిచేలా ఈ ఆలయాన్ని తీర్చిదిద్దాలని  సీఎం రేవంత్ రెడ్డి సంకల్పించారు. ఇందుకోసం ప్రభుత్వం ఏకంగా 351 కోట్ల రూపాయలను మంజూరు చేసింది.

►ALSO READ | ఈ సారి శ్రీ పంచముఖ సంకటహార మహా గణపతిగా ఖైరతాబాద్ బడా గణేష్

ప్రభుత్వం నిర్దేశించిన గడువులోనే పనులన్నీ పూర్తయ్యేలా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగాలని మంత్రి అధికారులను ఆదేశించారు. వచ్చే శ్రీరామ నవమి నాటికి నిర్దేశించిన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేలా.. ముందస్తు ప్రణాళికతో అన్ని పనులను సమాంతరంగా చేపట్టబోతున్నారు. త్వరలోనే భద్రాద్రి రామయ్య క్షేత్రం సరికొత్త ఆధ్యాత్మిక శోభతో భక్తులకు దర్శనమివ్వనుంది.