దేశంలోనే ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం SBI.. తన ఆస్తుల నాణ్యతను కాపాడుకోవడంలో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. 4వ త్రైమాసిక ఫలితాల సందర్భంగా బ్యాంక్ చైర్మన్ సీ.ఎస్. శెట్టి కీలక ప్రకటన చేశారు. బ్యాంక్ అప్పుల వసూళ్లను మరింత పకడ్బందీగా మార్చేందుకు వచ్చే ఏడాది కాలంలో 4వేల మంది ఉద్యోగులను ప్రత్యేకంగా 'కలెక్షన్ టీమ్' కోసం రిక్రూట్ చేసుకోనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే రెండు దశాబ్దాల కనిష్ట స్థాయి మొండి బకాయిల రేటుతో దూసుకుపోతున్న ఎస్బీఐ.. భవిష్యత్తులో ఒక్క రూపాయి కూడా నష్టపోకూడదనే పట్టుదలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కొత్త కలెక్షన్ మెకానిజం:
బ్యాంకులో కొత్తగా చేరబోయే 4వేల మంది లోన్స్ రికవరీ టీం బ్రాంచీల్లో కూర్చుని పని చేసే వారు కాదు. వీరు పూర్తిగా ఫీల్డ్ లో ఉండి.. నేరుగా లోన్స్ తీసుకున్న కస్టమర్లతో సంప్రదించే పనిలో ఉంటారట. వీరంతా ప్రస్తుత ఎస్బీఐ ఉద్యోగుల నుంచి కాకుండా.. అనుబంధ సంస్థ ద్వారా రిక్రూట్ కాబోతున్నట్లు వెల్లడైంది. సెంట్రల్ మేనేజ్‌మెంట్ నిఘాలో ఉంటూనే.. క్షేత్రస్థాయిలో లోన్ పేమెంట్ వసూళ్లను వీరు పర్యవేక్షిస్తారు. అండర్ రైటింగ్ ప్రమాణాలను ఇప్పటికే ప్రక్షాళన చేసిన ఎస్బీఐ, ఇప్పుడు వసూళ్ల యంత్రాంగాన్ని కూడా బలోపేతం చేయడం ద్వారా తన లోన్ బుక్‌ను కంచు కోటలా మార్చాలని ప్లాన్ చేస్తోంది.
కఠిన చర్యలకు కారణం ఏమిటి?
లోన్ తీసుకున్న వారు చెల్లింపుల్లో ఆలస్యం చేసినప్పుడు.. ఆ లోన్స్ 'స్ట్రెస్డ్ లోన్స్'గా మారకముందే వాటిని అరికట్టాలనేది బ్యాంక్ ప్రధాన లక్ష్యం. ముఖ్యంగా ఆర్బీఐ ప్రతిపాదించిన 'ఎక్స్‌పెక్టెడ్ క్రెడిట్ లాస్' రూల్స్ ప్రకారం.. లోన్ కట్టడం కొంచెం ఆలస్యమైనా, బ్యాంకులు ముందుగానే కొంత నిధులను పక్కన పెట్టాల్సి ఉంటుంది. దీనివల్ల బ్యాంక్ లాభాలపై ప్రభావం పడుతుంది. అందుకే అసలు లోన్ మెుండి బకాయిగా మారటానికి ముందే ప్రారంభ దశలోనే లోన్ పేమెంట్స్ వసూలు చేయటమే ఈ 4వేల మంది సిబ్బంది బాధ్యత.
గడచిన ఆర్థిక సంవత్సరంలోనే ఎస్బీఐ తన ఉద్యోగుల సంఖ్యను 2.36 లక్షల నుండి 2.45 లక్షలకు పెంచింది. ఇప్పుడు ఈ కొత్త రిక్రూట్‌మెంట్‌తో బ్యాంక్ మరింతగా విస్తరించనుంది. ఇప్పటికే పెద్ద లోన్స్ కి సంబంధించిన మొండి బకాయిల పరిష్కారం కోసం SARG వంటి విభాగాలు పనిచేస్తుండగా.. ఇప్పుడు రిటైల్ అండ్ స్మాల్ లోన్ వసూళ్ల కోసం ఈ ఫీల్డ్ టీమ్ కీలకం కానుంది. మొత్తానికి లోన్ తీసుకోవడం ఎంత సులభమో.. దాన్ని సకాలంలో కట్టకపోతే ఎస్బీఐ కలెక్షన్ టీమ్‌ను ఎదుర్కోవడం అంత కష్టమనే సంకేతాలను బ్యాంక్ స్పష్టంగా పంపనుంది. సో సింపుల్ గా చెప్పుకోవాలంటే కొత్తగా రానున్న 4వేల మంది స్టేట్ బ్యాంక్ రికవరింగ్ టీం కస్టమర్ల గోళ్లు విరగొట్టైనా డబ్బులు వసూలు చేయాల్సిందే అన్నమాట.
