- 132 మెటీరియల్ ఆబ్జెక్ట్స్ కోర్టుకు సమర్పించాం
- జనవరిలో వచ్చిన 7 మెటీరియల్స్ రిపోర్టు రెడీ
- ఓటుకు నోటు కేసు ఎవిడెన్స్ 2021లోనే కోర్టుకు ఇచ్చామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఫోరెన్సిక్ ల్యాబ్(టీజీఎఫ్‌ఎస్‌ఎల్)లో శనివారం జరిగిన అగ్నిప్రమాదంలో రెండు కేసులకు సంబంధించిన ఆధారాలు కాలిపోయాయంటూ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని టీజీఎఫ్‌ఎస్‌ఎల్ డైరెక్టర్ శిఖా గోయల్ స్పష్టం చేశారు. ప్రమాద ఘటనపై ఆదివారం ఎఫ్‌ఎస్‌ఎల్ కార్యాలయంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. 2015లో ఏసీబీ నమోదు చేసిన ఓటుకు నోటు కేసులో కోర్టు ద్వారా ఎఫ్‌ఎస్‌ఎల్‌కు మొత్తం 16 మెటీరియల్ ఆబ్జెక్ట్‌లు అందాయని, వాటిని పరిశీలించి అదే ఏడాదిలో నివేదికను కోర్టుకు సమర్పించామని చెప్పారు. ఈ కేసులో మిగతా అన్ని మెటీరియల్ ఆబ్జెక్ట్‌లు మరోసారి మార్చి 2021న న్యాయస్థానానికి అప్పగించినట్టు వెల్లడించారు. అగ్నిప్రమాద ఘటన సమయంలో ఓటుకు నోటు కేసునకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు ఎఫ్‌ఎస్‌ఎల్‌లో లేవని తెలిపారు.
డేటా ఉందో.. పోయిందో పరిశీలిస్తం
పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసులో మార్చి 2024 నుంచి జనవరి 2026 వరకు మొత్తం 132 మెటీరియల్ ఆబ్జెక్ట్‌లు ఎఫ్‌ఎస్‌ఎల్‌కు అందాయని, ఇందులో 7 మినహా మిగిలిన అన్నింటిని పరిశీలించి నివేదికలను సమర్పించినట్టు శిఖా గోయల్ పేర్కొన్నారు. జనవరిలో వచ్చిన 7 ఐటమ్స్ పరిశీలన కూడా పూర్తయిందని, నివేదికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. వాటిని తీసుకెళ్లేందుకు అధికారులు రావాల్సి ఉందన్నారు. అయితే, శనివారం అగ్నిప్రమాదం జరిగిన అంతస్తులోనే ఆ 7 ఐటమ్స్ ఉన్నాయని, ప్రమాదం తర్వాత వాటిని సురక్షితంగా భద్రపర్చామని స్పష్టం చేశారు. అవి చూడడానికి బాగానే ఉన్నాయని, అందులోని డేటా ఏమైనా పోయిందా లేదా అనేది పరిశీలిస్తామని తెలిపారు. ఇతర కేసులకు సంబంధించిన ఆధారాలేమైనా కాలిపోయాయా లేదా పరిశీలిస్తున్నామన్నారు. అందుకు కొంత సమయం పడుతుందన్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఎఫ్‌ఎస్‌ఎల్ భవనంలోని మొదటి అంతస్తులో మంటలు వ్యాపించాయని, ఈ ఘటనపై నాంపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని పేర్కొన్నారు. పూర్తి విచారణ తర్వాతే అసలు కారణం తెలుస్తుందన్నారు. అగ్నిప్రమాదంలో కొన్ని కీలక కేసుల ఆధారాలు కాలిపోయాయని సోషల్ మీడియా, ఇతర మీడియాలో ఆధార రహిత ప్రచారం జరుగుతోందని..దీన్ని ఖండిస్తున్నట్టు శిఖా గోయల్ పేర్కొన్నారు. ఎఫ్‌ఎస్‌ఎల్‌లో స్మోక్ డిటెక్టర్లు, ఫైర్ ఎక్స్‌టింగ్విషర్‌లు ఉన్నాయని, నిబంధనల ప్రకారం అన్ని ప్రమాణాలు పాటిస్తున్నామని తెలిపారు.
