- ఘట్కేసర్లో మహిళల నిరసన ర్యాలీ
ఘట్కేసర్, వెలుగు: నాయకులు రాజకీయాలు పక్కన పెట్టి రైల్వే బ్రిడ్జి పూర్తి చేయడానికి సహకరించాలని ఘట్కేసర్లో మహిళలు భారీ నిరసన చేపట్టారు. పట్టణంలో 13 ఏళ్లుగా నిర్మిస్తున్న రైల్వే బ్రిడ్జి పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఈడబ్ల్యూఎస్ కాలనీ చౌరస్తాలోని స్వామి వివేకానంద విగ్రహం నుంచి మాధవరెడ్డి రైల్వే బ్రిడ్జి, రైల్వే గేటు, బస్ టెర్మినల్ మీదుగా అంబేద్కర్ చౌరస్తా వరకు శాంతి ర్యాలీ నిర్వహించారు.
యువజన సంఘాల ఆధ్వర్యంలో బస్ టెర్మినల్ సమీపంలో మహిళలు, యువకులు స్వచ్ఛందంగా సామూహిక నిరసన దీక్ష చేపట్టారు. ఇప్పటికైనా రైల్వే బ్రిడ్జి పూర్తి చేయకుంటే రాజకీయ నాయకులను ఎక్కడికక్కడ నిర్బంధిస్తామని హెచ్చరించారు, దీంతో పట్టణంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఘట్కేసర్ సీఐ బాలస్వామి బందోబస్తు ఏర్పాటు చేశారు.
