- ఓట్లు కొని గెలవాలని కుట్ర చేస్తున్నయ్: బండి సంజయ్
- కాంగ్రెస్, ఎంఐఎం వర్సెస్ బీజేపీ మధ్య కబడ్డీ ఆట మొదలైంది
- రామాయణంలో రాముడికి గుర్తొచ్చేది రావణుడు.. నాకు ఒవైసీ
- కాంగ్రెస్, ఎఐఎంను చిత్తుచిత్తుగా ఓడించాలని ప్రజలకు పిలుపు
- కరీంనగర్‌లో విజయ సంకల్ప ర్యాలీ
కరీంనగర్/హుస్నాబాద్, వెలుగు: కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి 50 సీట్లు ఖాయమని తేలడంతో కాంగ్రెస్, ఎంఐఎం మధ్య రూ.100 కోట్ల డీల్ కుదిరిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఆ డబ్బుతో ఓట్లను కొనుగోలు చేసి బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని వ్యాఖ్యానించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్‌లో కబడ్డీ ఆట మొదలైందని, ఇండియా పేరుతో బీజేపీ, పాకిస్తాన్ పేరుతో కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు కలిసి ఆటను ప్రారంభించాయన్నారు. ఆ రెండు పార్టీలను చిత్తుచిత్తుగా ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం కరీంనగర్‌లో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో బీజేపీ ‘విజయ సంకల్ప ర్యాలీ’ని నిర్వహించారు. బీజేపీ తెలంగాణ ఇన్‌చార్జి, మహారాష్ట్ర ఐటీ మంత్రి ఆశిశ్ షెల్లార్, మాజీ ఎంపీ, సినీ నటి నవనీత్ కౌర్ ఈ ర్యాలీకి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కరీంనగర్ కలెక్టరేట్ రెవెన్యూ గార్డెన్స్ నుంచి ప్రారంభమై ప్రతిమ మల్టీప్లెక్స్, వన్ టౌన్ పోలీస్ స్టేషన్, వేంకటేశ్వర టెంపుల్, అమరవీరుల స్థూపం, పోస్టాఫీస్ మీదుగా టవర్ సర్కిల్ దాకా నిర్వహించిన ఈ ర్యాలీలో వేలాది మంది కాషాయ పగిడీలు ధరించి పాల్గొన్నారు. టవర్ సర్కిల్‌లో నిర్వహించిన సభలో బండి సంజయ్ మాట్లాడుతూ.. కరీంనగర్ కార్పొరేషన్‌లో బీజేపీ 50 సీట్లు గెలిచి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోబోతున్నదని సర్వేలన్నీ తేల్చడంతో కాంగ్రెస్, ఎంఐఎం నేతల వెన్నులో వణుకు మొదలైందన్నారు. అందుకే ఒవైసీ కరీంనగర్‌కు వచ్చి ఎంఐఎం గేర్ మారుస్తుందని మాట్లాడాడని విమర్శించారు. కబడ్డీ ఆటలో ఇండియా టీం పక్షాన బీజేపీ ఆడుతుంటే... పాకిస్తాన్ టీం పక్షాన కాంగ్రెస్, ఎంఐఎం కలిసి అడుతున్నాయన్నారు. వాళ్లు ఎన్ని కుట్రలు చేసినా.. ఈనెల 11న జరిగే ఫైనల్ లో బీజేపీ టీం కప్ గెలుచుకోవడం ఖాయమన్నారు.
మాకు కుటుంబం కంటే.. దేశం, ధర్మమే ముఖ్యం
బీజేపీ నేతలకు కుటుంబం కంటే.. దేశం, ధర్మమే ముఖ్యమని, దుష్ట శిక్షణ కోసం కొన్నిసార్లు ఇంటిని కూడా మర్చిపోతామని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ‘‘రామాయణంలో రాముడికి ఎప్పుడూ రావణుడే గుర్తొచ్చాడు కదా.. మహాభారతంలో పాండవులకు కౌరవులే గుర్తొచ్చారు కదా.. ఈ బండి సంజయ్‌కి కూడా ఒవైసీనే గుర్తుకొస్తున్నడు. రామాయణం, మహాభారతంలో రావణుడు, కౌరవులకు ఏ గతి పట్టిందో ఎంఐఎంకు కూడా అదే గతి పట్టించేదాకా విశ్రమించే ప్రసక్తే లేదు” అని పేర్కొన్నారు. కరీంనగర్‌లో కాంగ్రెస్, ఎంఐఎం కలిసి వచ్చినా, కుట్రలు చేసినా ఒక్క సీటు కూడా గెలవలేకపోయారని నిరూపించాలని కార్యకర్తలు, ప్రజలకు పిలుపునిచ్చారు. కులాలు, వర్గాలు, వర్ణాలు, డివిజన్ల పేరుతో మనం విడిపోయి.. పచ్చ పార్టీ (ఎంఐఎం) గెలిస్తే కరీంనగర్ పరిస్థితి ఎట్లుంటదో ఒక్కసారి ఆలోచించుకోవాలన్నారు.
గుణమున్నోడికి ఓటేస్తే తోడుంటడు.
ఓటు వేసేటప్పుడు ప్రతి ఒక్కరూ ఆలోచన చెయ్యాలని, గుణమున్నోడికి ఓటేస్తే కష్టాల్లో తోడుండేందుకు ఇంటికి వస్తాడని, అదే పైసలున్నోడికి ఓటేస్తే ‘జీ హుజూర్.. బాంఛన్’ అంటూ బతకాలి అని బండి సంజయ్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. హుస్నాబాద్ అభివృద్ధి కోసం ఒక్క పైసా కూడా ఇవ్వలేదని చెప్పారు. అక్కడక్కడా కనినిపిస్తున్న రోడ్లన్నీ కేంద్రం ఇచ్చిన పైసలతో వేసినవేనని తెలిపారు. ‘‘మాకు అబద్ధాలు చెప్పడం రాదు.. దొంగ హామీలు ఇచ్చి మోసం చేయడం అస్సలే రాదు.. అందుకే మిమ్మల్ని అడుగుతున్న.. హుస్నాబాద్‌లో ఒక్కసారి బీజేపీకి ఓటేసి గెలిపించండి.. ఢిల్లీకి పోయి పైసలు పట్టుకొచ్చి పట్టణాన్ని ఎలా అభివృద్ధి చేస్తనో చూడండి” అని అన్నారు. హుస్నాబాద్.. పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మారినా అభివృద్ధి మాత్రం జరగలేదని, డ్రైనేజీలు, రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తే.. ఆడ బిడ్డలకు రూ. 2,500, రూ. 4 వేల పెన్షన్, తులం బంగారం, స్కూటీలు వచ్చినయా? అని ప్రశ్నించారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని పేద స్టూడెంట్లు బడికి పోవడానికి ఇబ్బంది పడుతుంటే తన సొంత పైసలతో 20 వేల సైకిళ్లు కొనిచ్చానని చెప్పారు. ఒక్క తప్పుడు నిర్ణయం తీసుకున్నా ఐదేండ్లు నరకం చూస్తారని, అందుకే నిండు మనసుతో బీజేపీ క్యాండిడేట్లను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాంగోపాల్‌రెడ్డి, ప్రభారి విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
