హైదరాబాద్: జీహెచ్ఎంసీ వార్డుల విభజన తుది నివేదిక ప్రభుత్వానికి చేరింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ సోమవారం (డిసెంబర్ 22) సీఎస్ రామకృష్ణా రావుకి ఫైనల్ రిపోర్ట్ అందజేశారు. కాగా, ఔటర్ రింగ్ రోడ్డు (ORR) లోపల ఉన్న 20 మున్సిపాలిటీలు,7 కార్పొరేషన్లను ప్రభుత్వం జీహెచ్ఎంసీలో విలీనం చేసిన విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగా జీహెచ్ఎంసీలో డివిజన్ల సంఖ్యను 150 నుంచి 300కి పెంచింది. ఈ క్రమంలో డివిజన్ల విభజనపై 6 వేలకు పైగా అభ్యంతరాలు వచ్చాయి. అభ్యంతరాలను పరిశీలించిన అధికారులు సహేతుకమైన వాటిని పరిగణలోకి తీసుకున్నారు.
ఈ మేరకు వార్డుల విభజన ప్రిలిమినరీ నోటిఫికేషన్‌కి మార్పులు చేసి ఫైనల్ నోటిఫికేషన్‌ను ప్రభుత్వానికి సమర్పించారు. ప్రభుత్వ పరిశీలన అనంతరం జీహెచ్ఎంసీ వార్డుల విభజనపై రేపు లేదా ఎల్లుండి ఫైనల్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందంటున్నారు అధికారులు. మరోవైపు.. జీహెచ్ఎంసీ వార్డుల విభజనకు హైకోర్టు నుంచి కూడా క్లియరెన్స్ వచ్చింది. జీహెచ్ఎంసీ డీలిమిటేషన్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్లు హైకోర్టు కొట్టేసింది. ఈ అంశంలో జోక్యం చేసుకోలేమని న్యాయస్థానం తేల్చిచెప్పింది.
