గౌరవ్ గొగొయ్‎కి పాక్ ఏజెంట్‎తో లింక్స్.. సీక్రెట్‎గా ఆ దేశానికి వెళ్లొచ్చారు: సీఎం హిమంత

గౌరవ్ గొగొయ్‎కి పాక్ ఏజెంట్‎తో లింక్స్.. సీక్రెట్‎గా ఆ దేశానికి వెళ్లొచ్చారు: సీఎం హిమంత

గువాహటి: అస్సాం పీసీసీ చీఫ్, లోక్ సభలో కాంగ్రెస్ డిప్యూటీ లీడర్ గౌరవ్ గొగొయ్, ఆయన బ్రిటిష్ భార్య ఎలిజబెత్ కోల్బర్న్‎కు పాక్ ఏజెంట్‎తో లోతైన సంబంధాలు ఉన్నాయని ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వ శర్మ సంచలన ఆరోపణలు చేశారు. పాక్ ఏజెంట్ అలీ తౌకీర్ షేక్ ఆధ్వర్యంలోని సంస్థ నుంచి కోల్బర్న్‎కు శాలరీ అందుతోందని, ఇండియా క్లైమేట్ యాక్షన్‎కు సంబంధించిన ఇంటెలిజెన్స్ బ్యూరో సమాచారాన్ని ఆమె షేక్‎కు అందజేశారని అన్నారు. 

ఈ అంశంపై ఆదివారం గువాహటిలో హిమంత మీడియా సమావేశంలో మాట్లాడారు. గొగొయ్ 2013లో సీక్రెట్ గా పాకిస్తాన్ లో పది రోజులు పర్యటించి వచ్చారని, అక్కడ ఒకరకమైన ట్రెయినింగ్ కూడా తీసుకున్నట్టు సమాచారం ఉందని సీఎం చెప్పారు.

 ‘‘అలీ తౌకీర్ షేక్ ఆధ్వర్యంలోని లీడ్ పాకిస్తాన్ సంస్థలో కోల్బర్న్ పని చేశారు. ఆమెకు పాకిస్తాన్ లో బ్యాంక్ అకౌంట్ కూడా ఉంది. తర్వాత ఆమె లీడ్ పాకిస్తాన్ ఆధ్వర్యంలోని లీడ్ ఇండియా సంస్థలో ఇండియాకు వచ్చి పని చేశారు. లీడ్ పాకిస్తాన్ నుంచి లీడ్ ఇండియా ద్వారా కోల్బర్న్ శాలరీ అందుకున్నారు. ఈ విషయంలో ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్(ఎఫ్ సీఆర్ఏ) నిబంధనలను ఉల్లంఘించారు.

 ఇదంతా గత యూపీఏ సర్కారు హయాంలోనే జరిగింది. అయితే, గొగొయ్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆయనను అరెస్ట్ చేస్తే.. నేను రాజకీయం చేస్తున్నానన్న ఆరోపణలు వస్తాయి. అందుకే ఈ కేసును కేంద్ర హోం శాఖకు పంపుతున్నాం” అని హిమంత వివరించారు.

పాక్ వెళ్లొచ్చాక మన ఆర్మీ గురించి అడిగారు.. 

లీడ్ ఇండియాలో పని చేస్తుండగా, కోల్బర్న్ ఆరు సార్లు ఇస్లామాబాద్ వెళ్లి వచ్చారని హిమంత తెలిపారు. మరో ఎన్ జీవోలో చేరిన తర్వాత కూడా మూడు సార్లు పాక్ కు వెళ్లి వచ్చారన్నారు. ‘‘కోల్బర్న్ ఉనికి దేశానికే ప్రమాదకరం కాబట్టి.. ఆమె ఓవర్సీస్ సిటిజన్ షిప్ ఆఫ్ ఇండియా(పర్మనెంట్ వీసా)ను రద్దు చేయాలని కోరతాం. గొగొయ్ 2013, డిసెంబర్ లో సీక్రెట్ గా పాకిస్తాన్ కు వెళ్లి వచ్చిన తర్వాత ఆయన లోక్ సభలో అడిగిన ప్రశ్నలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. 

తొలిసారిగా ఎంపీగా ఎన్నికైన వ్యక్తి.. మన మిలిటరీ సన్నద్ధత, భద్రతా విషయాలు, డిఫెన్స్ హార్డ్ వేర్, న్యూక్లియర్ ప్లాంట్లు, గూఢచర్యం, కాశ్మీర్ వివాదం వంటి సున్నితమైన అంశాలపై ప్రశ్నలు అడిగారంటే.. ఆయనకు, పాక్ పర్యటనకు లింక్ ఉందేమోనన్న డౌట్స్ వస్తున్నాయి. తౌకీర్ షేక్ కూడా 2010 నుంచి 2013 మధ్య యూపీఏ హయాంలోనే ఇండియాకు 13 సార్లు వచ్చి వెళ్లాడు” అని సీఎం పేర్కొన్నారు.

హిమంతవి చెత్త ఆరోపణలు: గొగొయ్ 

అస్సాం సీఎం హిమంత తనపై చేసిన ఆరోపణలు సీ గ్రేడ్ సినిమా కన్నా చెత్తగా ఉన్నాయని, ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ సూపర్ ఫ్లాప్ అయిందని గౌరవ్ గొగొయ్ అన్నారు. తనకు పాక్‎తో సంబంధాలు ఉన్నాయనడం తెలివిలేని, బోగస్ ఆరోపణలు అని ఖండించారు. 

హిమంత, ఆయన కుటుంబసభ్యులు 4 వేల ఎకరాల భూములు కొల్లగొట్టారని తేల్చేందుకు తాము చేపట్టిన పరివర్తన్ యాత్రే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ కన్నా బాగా హిట్ అయిందన్నారు. హిమంత ఆరోపణలు అస్సాంలో ఎవరూ సీరియస్‎గా తీసుకోవడం లేదన్నారు. తాము అధికారంలోకి రాగానే హిమంత భూదోపిడీపై దర్యాప్తు చేస్తామని, ఆ భూములను పేదలకు పంచుతామన్నారు.